రూ. 2 వేల నోటు ఇక ముందు కనిపించదా.. ఈ నోటు ముద్రణ నిలిపేయాలని ఆర్బీఐ డిసైడయ్యిందా.. ఈ అనుమానాలు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా వస్తున్నాయి. మోడీ తొలి ఐదేళ్ల పాలనలో తీసుకున్న సంచలన నిర్ణయం పెద్ద నోట్ల రద్దు తర్వాత ఊపిరిపోసుకున్న ఈ 2 వేల నోటు కథ దాదాపు ముగిసిపోయినట్టేనని తెలుస్తోంది.
ఈ రెండువేల రూపాయల నోట్ల ముద్రణ వల్ల వచ్చిన నష్టం ఏమిటో ఆర్బీఐ తెలుసుకుందేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఏడాది ఒక్క 2 వేల నోటు కూడా ముద్రించలేదట. ఈ విషయాన్ని సాక్షాత్తూ రిజర్వు బ్యాంకే వెల్లడించింది. ఈ ఏడాది ఇంతవరకు ఒక్క రూ.2వేల నోటు కూడా ముద్రణ కాలేదని సమాచార హక్కు చట్టం కింద ఆర్బిఐ ఇచ్చిన సమాధానంలో తెలిపింది.
ఆర్‌టీఐ సమాచారం ప్రకారం 2017లో రూ .2 వేల కరెన్సీ నోట్లను 3,542.991 మిలియన్ నోట్లను ముద్రించినట్లు ఆర్‌బిఐ తెలిపింది. 2018లో ఈ సంఖ్య ఇంకా తగ్గిపోయింది. ఇక ఈ ఏడాది కనీసం ఒక్క నోటు కూడా ముద్రించలేదట. అంటే ఇక కొత్తగా ఈ 2 వేల నోటను ముద్రించకూడదని ఆర్బీఐ డిసైడైనట్టు తెలుస్తోంది.
ఈ 2 వేల నోటు కారణంగా నల్లధనం దాచడం బాగా పెరిగినట్టు పలు ఉదంతాలు నిరూపించాయి. ఒక్క కట్ట ద్వారా 2 లక్షల రూపాయలు తరలించే సౌలభ్యం ఈ నోటు ద్వారా కలిగింది. ఈ ఏడాది ప్రారంభంలో ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో 6 కోట్ల రూపాయల అక్రమ నగదును స్వాధీనం చేసుకున్న ఉదంతంతో ఈ నోటు ముద్రణపై బాగా విమర్శలు వచ్చాయి. అందుకే నల్లధనాన్ని అడ్డుకట్ట వేసేందుకు రూ.2వేల నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపివేసినట్టే. అయితే ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్లు మాత్రం చెల్లుతాయి.