మరికాసేపట్లో క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించే మ్యాచ్ జరగనుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) , చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వేదిక మాత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంత గడ్డ అయిన చిన్నస్వామి స్టేడియం. ఈ మ్యాచ్‌లో ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు తలపడనుండటం విశేషం. ఒకవైపు మిస్టర్ ఐపీఎల్, కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై జట్టు ఉండగా.. మరోవైపు రన్ మెషిన్, కింగ్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న బెంగళూరు జట్టు బరిలోకి దిగనుంది. ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య పోరు ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
అయితే, ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన చెన్నై జట్టు పాయింట్స్ టేబుల్‌లో చివరి స్థానంలో ఉండటం గమనార్హం. ఆడిన 10 మ్యాచ్‌లలో కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించగలిగింది. ఈ సీజన్‌లో చెన్నై, బెంగళూరు జట్లు కలిసి ఆడుతున్న చివరి మ్యాచ్ ఇది కావడంతో అభిమానులు ఎలాగైనా విజయం సాధించాలని కోరుకుంటున్నారు. మరోవైపు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఆడిన 10 మ్యాచ్‌లలో ఏకంగా 7 విజయాలు సాధించి పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడానికి ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం బెంగళూరుకు ఎంతో కీలకం. సొంతగడ్డపై చెన్నైని ఓడించి తమ విజయ పరంపరను కొనసాగించాలని ఆర్సీబీ ఉవ్విళ్లూరుతోంది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ రసవత్తర పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.