వైభవ్ సూర్యవంశీపై ఆసీస్ లెజెండ్ కీలక వ్యాఖ్యలు

0
15

భారత క్రికెట్‌లో నూతనంగా సంచలనం సృష్టిస్తున్న 14 ఏళ్ల యువ క్రీడాకారుడు వైభవ్ సూర్యవంశీ ప్రతిభను కాపాడుకోవాలని బీసీసీఐ , ఐపీఎల్ ఫ్రాంచైజీలు దృష్టి సారించాలని ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ సూచించారు. చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ చూపిస్తున్న వైభవ్‌కు సరైన మార్గనిర్దేశం , మద్దతు అందకపోతే అతడు దారి తప్పే ప్రమాదం ఉందని హెచ్చరించారు. యువ క్రీడాకారుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో క్రికెట్ వ్యవస్థల పాత్ర చాలా ముఖ్యమని చాపెల్ అభిప్రాయపడ్డారు. సచిన్ టెండూల్కర్ ప్రపంచ స్థాయిలో గొప్ప ఆటగాడిగా ఎదగడానికి, అతని ప్రతిభతో పాటు చిన్ననాటి కోచ్ మార్గనిర్దేశం , కుటుంబ సభ్యుల మద్దతు కూడా ముఖ్యమైన పాత్ర పోషించాయని చాపెల్ గుర్తుచేశారు. “సచిన్ విజయంలో ప్రతిభ మాత్రమే కాదు, అతని భావోద్వేగ పరిపక్వత, కోచ్ మార్గదర్శకత్వం, కుటుంబం అందించిన రక్షణ కూడా కీలకమైంది,” అని ఆయన అన్నారు.

అయితే, వినోద్ కాంబ్లీ గురించి మాట్లాడుతూ, అతనికి కూడా సచిన్‌ లాంటి ప్రతిభ ఉన్నప్పటికీ, చిన్న వయసులో వచ్చిన పేరు ప్రఖ్యాతులను, ఒత్తిడిని అతడు తట్టుకోలేకపోయాడని చాపెల్ తెలిపారు. “వినోద్ కాంబ్లీ కూడా సచిన్ అంతటి ప్రతిభాశాలే. కానీ, చాలా త్వరగా గుర్తింపులు వచ్చాయి, అతడు వాటిని సరిగా నిర్వహించుకోలేక పోయాడు,” అని ఆయన వివరించారు. అలాగే, పృథ్వీ షా గురించి కూడా మాట్లాడిన చాపెల్, అతనికి తిరిగి పుంజుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో, వైభవ్ సూర్యవంశీ విషయంలో బీసీసీఐ , ఐపీఎల్ ఫ్రాంచైజీల జాగ్రత్తగా వ్యవహరించాలని చాపెల్ సూచించారు. “యువ క్రీడాకారుల ప్రతిభను సరైన మార్గంలో నడిపించాల్సిన అవసరం ఉంది. వైభవ్‌ను కాపాడుకోవాలి. అతడిని మార్కెటింగ్ అవసరాల కోసం అతిగా ఉపయోగించకూడదు,” అని ఆయన స్పష్టం చేశారు. చిన్న వయసులోనే వచ్చే కీర్తి ప్రతిష్ఠలు, వాణిజ్య ఒప్పందాల ఒత్తిడి వారి ఎదుగుదలకు ఆటంకం కాకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.