విజయవాడ శివారు సూరంపల్లిలో ఈరోజు మధ్యాహ్నం జరిగిన పేలుడుకు కారణాలను పోలీసులు గుర్తించారు. ప్లాస్టిక్ డోర్లకు షైనింగ్ పెట్టడానికి వినియోగించే రేజీనం అనే లిక్విడ్ కారణంగా పేలుడు సంభవించిందని ప్రాథమికంగా తేలింది. ఈ రేజీనం అనే లిక్విడ్ ని పెద్ద డబ్బాల్లో నిల్వ ఉంచాల్సి ఉంది. కానీ ఈ జయరాజ్ ఎంటర్ ప్రైజెస్ యజమాని 100 లీటర్ల సరుకుని అంతే పట్టే ప్లాస్టిక్ డబ్బాలో ఉంచాడు.
అయితే దీని వల్ల ఆ డబ్బాలో ప్రమాదకరమైన గ్యాస్ తయారైనట్టు పోలీసులు గుర్తించారు. షాపులో ఉన్న స్క్రాప్ తీసుకువెళ్లేందుకు వచ్చిన తండ్రీకొడుకులు ఈ డబ్బాను పగలకొట్టడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ సమయంలో తండ్రీకొడుకులు ఇద్దరూ అక్కడే చనిపోయారు. పేలుడు తీవ్రతకు మృతదేహాలు… 50 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. సంఘటనాస్థలంలో పెద్ద గొయ్యి కూడా ఏర్పడింది. ఇక జయరాజ్ ఎంటర్ ప్రైజెస్ కు అనుమతులు లేవని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు.