రెబల్ ఎమ్మెల్యేను అందలం ఎక్కిస్తే..సీనియర్ నేతలకు హ్యాండిచ్చాడా ?

-

కీలకమైన కార్పోరేషన్ ఎన్నికల వేళ ఆ రెబల్ ఎమ్మెల్యేను అందలం ఎక్కించింది అధికార పార్టీ. గ్రేటర్ ఎన్నికల్లో టిక్కెట్ల బాధ్యతను ఆయన చేతుల్లోనే పెట్టింది. ఈ పరిణామంతో గ్రేటర్ విశాఖ కార్పోరేషన్ లో వర్గ రాజకీయాలు మరింత వేడెక్కాయి. టికెట్లు దక్కని అసంతృప్తులు..పార్టీలో ప్రారంభం నుంచి పని చేస్తున్న సీనియర్లు ఎమ్మెల్యే పై రగిలిపోతున్నారు.పార్టీలో సీనియర్లతో పాటు తన వెంట వచ్చిన నేతలకు కూడా ఎమ్మెల్యే హ్యాండివ్వడంతో ఎమ్మెల్యే వ్యవహరం అధికారపార్టీలో హాట్ టాపిక్ గా మారింది.

విశాఖ దక్షిణ నియోజకవర్గంలో రాజకీయాలు హీటెక్కిపోయాయి. జీవీఎంసీ ఎన్నికల వేళ వైసీపీలో అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్లో మొత్తం వార్డుల సంఖ్య 98 కాగా వీటిలో 13 పాతనగరం పరిధిలోనే వున్నాయి. గత ఏడాది నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ తన వర్గీయులకు టిక్కెట్లు ఇప్పించుకున్నారు. ఎన్నికలు వాయిదాపడిన తర్వాత నియోజకవర్గంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

కరోనాతో అస్వస్ధతకి గురై ద్రోణంరాజు శ్రీనివాస్ మరణించారు. తెలుగుదేశం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీ ఫిరాయించారు. ప్రస్తుతం టీడీపీ రెబల్ ఎమ్మెల్యేగా వాసుపల్లి కొనసాగుతున్నారు. తాజాగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో దక్షిణ నియోజకవర్గం అభ్యర్ధుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేపై పెట్టింది వైసీపీ అధిష్టానం. ఇక్కడి నుంచే వర్గ రాజకీయాలు ఊపందుకున్నాయ్. వాసుపల్లి గణేష్ కుమార్ తనదైన మార్క్ చూపించేందుకు..బీఫామ్‌ పొందిన అభ్యర్ధులను సైతం మార్చేశారు.

ఈ ఎఫెక్ట్ పడిన వారిలో నియోజకవర్గ వైసీపీ మహిళా అధ్యక్షురాలు గౌరి, సీనియర్ కార్పొరేటర్ కొప్పుల వెంకటరావు భార్య స్వర్ణలత వున్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి తీరుపై కొప్పుల వెంకటరావు వర్గీయులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడతామని ఫైర్ అవుతున్నారు. వాసుపల్లి ఝలక్ అధికార పార్టీకే పరిమితం కాలేదు. ఆయనను నమ్ముకుని టీడీపీని వదిలి వచ్చిన సీనియర్ నాయకులకు కూడా తగిలింది.

దక్షిణ నియోజకవర్గం పరిధిలో ఇద్దరు అభ్యర్ధులకు అర్బన్ అధ్యక్షుడి హోదాలో టీడీపీ బీఫాం ఇచ్చారు వాసుపల్లి. ఆయన పార్టీ ఫిరాయించడంతో అవి చెల్లవు. అలాగని, ఆ ఇద్దరు కార్పొరేటర్ అభ్యర్ధులకు వైసీపీలో టిక్కెట్లు లేవు. వారు తిరిగి టీడీపీని ఆశ్రయించినా తిరస్కరణ తప్పలేదు. దీంతో వాసుపల్లి వ్యవహారంపై వైసీపీలో అంతర్గతంగా గట్టి చర్చ జరుగుతోంది. చాలా మంది అసంతృప్తులు… ఆయనపై గుర్రుగా ఉన్నట్లు విశాఖ వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఎన్నికల వేళ వైసీపీ అధిష్టానం ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తుందన్నది ఆసక్తిగా మారింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version