దేశంలో కరోనాతో పాటు ఓమిక్రాన్ వేరియంట్ ను ఎదుర్కొవడానికి మరో రెండు వ్యాక్సిన్లకు త్వరలోనే అనుమతి రానున్నాయి. సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కొవొవాక్స్ తోపాటు బయోలాజికల్ – ఈ తయారు చేసిన కార్బెవాక్స్ కు అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ ( సీడీఎస్‌సీవో) కు చెందని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. కొవొవాక్స్ టీకా అమెరికా కు చెందిన నొవావాక్స్ నుంచి వచ్చింది. అమెరికా నొవావాక్స్ ను భారత్ లో కొవొవాక్స్ గా సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించింది.
కొవొవాక్స్ పై అమెరికా, బ్రిటన్ లలో రెండు, మూడు దశలో క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను సీడీఎస్‌సీవో నిపుణులు పరిశీలించారు. అనేక అధ్యయనాల తర్వాత కొవొవాక్స్ అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వవచ్చు అని సిఫార్సు చేశారు. అలాగే బయోలాజికల్ – ఈ తయారు చేసిన కార్బెవాక్స్ కు కూడా సీడీఎస్ సీవో కొన్ని పరిమితులు విధించి అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని సిఫార్స్ చేసింది.