తెలంగాణవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవగా.. వాగులు, వంకలు పొంగుతున్నాయి. ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. అయితే, రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఉత్తర ద్వీపకల్ప భారత దేశం అంతటా సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఈస్ట్ వెస్ట్ షీర్ జోన్ వ్యాపించి ఉందని ఐఎండీ తెలిపింది.
అయితే గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం జయశంకర్ భూపాల్‌పల్లిలో నమోదైంది. జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లాలోని ముత్తారంలో గడిచిన 24 గంటల్లో 347 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే.. ఇప్పటికే జయశంకర్ భూపాల్‌పల్లిలో జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు నిండిపోయాయి. చెరువుల కట్టలు తెగి వరద నీరు గ్రామాల్లోకి చేరుతోంది. ఇప్పటికే అధికార యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది. అయితే.. పలు గ్రామాలకు వెళ్లే దారులు వరద నీటితో కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.