జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన బాధితులు పోగొట్టుకున్న రూ.40 లక్షల విలువచేసే 200 సెల్ ఫోన్లను రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి రికవరీ చేసిన ఆయా సెల్ ఫోన్లను ఆదివారం ఆయన చిత్తూరులోని పోలీస్ అతిథి గృహంలో మీడియా సమావేశంలో చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు దశలవారీగా రూ.3.60 కోట్ల విలువైన 1,700 ఫోన్లు చోరీకి గురై ఉండగా వాటిని తమ అధికారులు, సిబ్బంది కలిసి కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, బీహార్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో రికవరీ చేసినట్లు ఆయన వెల్లడించారు.
చాట్ బాట్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదు మేరకు రూ. 40 లక్షల విలువైన 200 మొబైల్ ఫోన్ లను గుర్తించామన్నారు. ఈ విధంగా ఇప్పటివరకు మూడు దశల్లో 1700 ఫోన్లు రికవరీ చేసినట్లు వెల్లడించారు. బయటి ప్రాంతాల్లో ఉన్న వారికి కొరియర్ ద్వారా పంపించినట్లు పేర్కొన్నారు. ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే ముందుగా 9440900004 నెంబర్ కు హాయ్ (హెచ్ ఐ ) అని లేదా హెచ్ఐఎల్పీ మెసేజ్ ఇవ్వాలన్నారు. ఆ తర్వాత పోలీస్ శాఖ నుంచి వచ్చే లింక్ లో పూర్తి చిరునామా తో పాటూ ఈఎంఈఐ నెంబర్ నమోదు చేయాలన్నారు. ఆ తర్వాత తమ సిబ్బంది చోరీకి గురైన ఆ సెల్ ఫోన్ ఏ ప్రాంతంలో ఉందో గుర్తించి దాన్ని రికవరీ చేస్తామని వెల్లడించారు.