ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 240 లెక్చరర్ పోస్టుల భర్తీ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ప్రతిపాదనలు పంపమని రాష్ట్ర ఉన్నత విద్యా కమిషనర్ పోలా భాస్కరరావు తెలిపారు. ప్రస్తుతం ఈ కళాశాలలో డిప్యూటేషన్ పై అధ్యాపకులు పనిచేస్తున్నారని చెప్పారు. వీరితో పాటు కాంట్రాక్టు లెక్చరర్ లను కూడా కేటాయించమన్నారు. ఉన్నత విద్యతో పాటు, ఉపాధికి బాటలు వేసేలా డిగ్రీ విద్యార్థుల బంగారు భవితను తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు.
విశాఖపట్నం మద్దిలపాలెం లోని డాక్టర్ వి.ఎస్.కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానాన్ని శనివారం భాస్కరరావు ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 165 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయన్నారు. వీటిలో రూ.391 కోట్లతో 27 కళాశాలలకు కొత్త భవనాల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. ఒక్కో కళాశాలకు రూ. 14.5 కోట్ల చొప్పున త్వరలో మంజూరు కానున్నయన్నారు.