రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత..కేంద్రానికి, రాష్ట్ర నేతలకు మధ్య దూరం తగ్గుతోంది. కేంద్రం కనుసన్నల్లోనే పార్టీ నడుస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆర్. ఎస్. ఎస్ మూలాలున్న సోము.. పార్టీలో కీలకంగా ఉండడంతో బీజేపీ అనుకూల పవనాలు బాగానే వీస్తున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఏం చెప్పినా.. కేంద్రం కూడా వినేందుకుసిద్ధంగా ఉన్నదనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి సోము కర్తవ్య నిష్ట కూడా బాగానే పనిచేస్తోంది.
అయితే, ఇది మరో కోణంలో చూసినప్పుడు.. సోముపై ఆయన సొంత సామాజిక వర్గం కాపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. కాపు సామాజిక వర్గానికి 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ.. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు చేసిన తీర్మానం.. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. దీనిపై కాపులు సోముపై ఒత్తిడి చేయాలని నిర్ణయించారు. తూర్పులో కాపులు దీనిని తెరమీదకు తేవాలని నిర్ణయించారు. ప్రస్తుతం సోముకు, కేంద్రంలోని బీజేపీ పెద్దలకు మధ్య సంబందాలు బలపడిన నేపథ్యంలో ఆయన ద్వారా తమ కార్యాన్ని పూర్తి చేయించుకునేందుకు కాపు నాయకులు రెడీ అయ్యారని తెలుస్తోంది.
ప్రస్తుతం కేంద్ర వద్ద పెండింగులో ఉన్న కాపు రిజర్వేషన్ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయించుకు నేందుకు సోమును ప్రయోగించడం సబబేనని అంటున్నారు కాపు నాయకులు. ఇక్కడే ఇంకో కీలక విషయం కూడా చర్చకు వస్తోంది. సోముకు.. గతంలో కాపు ఉద్యమానికి నేతృత్వం వహించిన ముద్రగడ పద్మనాభానికి పడేది కాదు. ఆయనను సోము అనేక సందర్భాల్లో వ్యతిరేకించారు.
ఈ క్రమంలోనే ఆయన ఇంకా సదరు ఉద్యమానికి తాను బాధ్యత వహిస్తే.. సోము పట్టించుకునే అవకాశం లేదనే ఉద్దేశంతోనే ఆ పదవి నుంచి తప్పుకొన్నారని అంటున్నారు. అంటే.. ఇప్పుడు సోముకు కాపులను రక్షించే పూర్తి బాధ్యత అప్పగిస్తే.. తమ కోరిక నెరవేరుతుందని కాపు ఉద్యమ నాయకులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సోముపై ఒత్తిడి పెరుగుతోంది. మరి ఆయన ఏం చేస్తారో.. చూడాలి.
-vuyyuru subhash