కొన్ని బందాలు ఏ జన్మలోవో అర్థంకాదు.. మరి కొన్ని బంధాలు ఎంతకాలం ఉంటాయో ఎప్పుడూ పోతాయో చెప్పలేము.. అలాంటి బంధమే చంద్రబాబు – వరుణుడుది అని అంటారు చరిత్ర తెలిసినవారు! గతంలో చంద్రబాబు అధికారానికి దూరమవ్వడానికి కూడా ఈ వరుణుడు వన్ ఆఫ్ ది రీజన్ అని అంటుంటారు. ఒకానొక సమయంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వరుణుడు అలిగాడని.. అందుకే వర్షాలు కురవడం లేదని.. ఇక తాము అధికారంలోకి వచ్చాము కాబట్టి ఇక వర్షాలకు డోకా లేదని గతంలో వైఎస్సార్ కూడా చమత్కరించారు! అయితే తాజాగా మరోసారి బాబుకు వరుణుడు దెబ్బకొట్టాడు!
గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వరుణుడు అస్సలు కనికరించేవాడు కాదు. అది కాకతాలీయమో యాదృశ్చికమో తెలియదు కానీ… ప్రతీసారీ అలానే జరిగేది. దాంతో ప్రజలతోపాటు చంద్రబాబు అభిమానులు కూడా ఈ విషయంలో ఫిక్సయిపోయారు! ఫలితంగా ఏపీ ఎప్పుడూ చూడని కరువులు కూడా చూసింది! ఆయా సందర్భాల్లో బాబుకు ఈ వరుణుడు మైనస్ అయ్యాడు, రైతులకు బాబుని శతృవుని చేశాడు కానీ… ఈసారి మాత్రం బాబుకు వరుణుడు ప్లస్ అయ్యాడని అంటున్నారు ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్!
కరోనా వల్ల రూము, జూము లకు మాత్రమే పరిమితమైన బాబు.. ప్రస్తుతానికి ఆ రెండింటినీ నమ్ముకునే రాజకీయం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అమరావతి ఉద్యమం 300రోజు సందర్భంగా ఏపీకి వచ్చారు చంద్రబాబు. ఈ సందర్భంగా బాబు స్టిల్ రూం జూమే కాగా… చినబాబుని జనాల్లోకి వదిలారు! అయితే వచ్చినపని అయిపోయింది అని వెళ్లిపోతే.. మళ్లీ జనాలు ఏమనుకుంటారోనని తెగ ఆలోచిస్తున్న చంద్రబాబుకు ఉన్నట్లుండి వరుణుడు ప్లస్ అయ్యాడు! ఇంతకాలం బాబుని ఇరకాటంలో పెట్టిన వరుణుడు.. నేడు బాబుకు ప్లస్ అయ్యాడు!
అవును… కరోనాకు జనాలు అలవాటుపడిపోయి జనజీవనం దాదాపు యదాస్థితికి వస్తున్న తరుణంలో.. ఈ సారి ఏ వంక పెట్టుకుని హైదరాబాద్ కి వెళ్లిపోవాలా అని తెగ ఆలోచిస్తున్న చంద్రబాబుకు… “కరకట్ట మీద ఇళ్లు కట్టుకున్న వాళ్లు వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలి.. కృష్ణానదికి వరద అవకాశాలు ఉన్నాయి” అని ప్రభుత్వం సూచించేసరికి గొప్ప కారణం దొరికింది! దీంతో బట్టల బ్యాగులు కార్ లో పెట్టించేయడానికి బాబు రెడీ అయిపోయారంట! ఈ సందర్భంగా ఇంతకాలం తనకు మైనస్ గా ఉన్న వరుణుడు.. ఈసారి ప్లస్ అయ్యాడని, ఫలితంగా మళ్లీ బాబు భాగ్యనగరంలోని జూము – రూం లకు వెళ్లిపోనున్నారు!!