ప్రముఖ షార్ట్ వీడియో మెసేజింగ్ యాప్ టిక్‌టాక్ కొనుగోలుకు సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్, మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లు ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్దేశించిన సెప్టెంబర్ 15 గడువులోగా టిక్‌టాక్ కొనుగోలు డీల్‌ను ఆయా సంస్థలు పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ అది చాలా తక్కువ గడువు కావడంతో ఆయా సంస్థలు టిక్‌టాక్‌ను కొనేందుకు నిరాసక్తతను ప్రదర్శిస్తున్నాయని తెలుస్తోంది. అయితే టిక్‌టాక్‌కు చెందిన ఇండియా బిజినెస్‌ను ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ కొనుగోలు చేస్తుందని వార్తలు వస్తున్నాయి.
టిక్‌టాక్ సీఈవో కెవిన్ మయర్ తాజాగా రిలయన్స్ గ్రూప్ ప్రతినిధులతో సమావేశమై ఇదే విషయంపై చర్చించారని సమాచారం. ప్రస్తుతం టిక్‌టాక్, రిలయన్స్‌ల మధ్య చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అటు టిక్‌టాక్ ఇండియా ప్రతినిధులు, ఇటు రిలయన్స్ ప్రతినిధులు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. మరోవైపు టిక్‌టాక్ విలువ 2.5 నుంచి 5 బిలియన్ల వరకు ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో మరికొద్ది రోజులు ఆగితే ఆ విలువ ఇంకా పడిపోతే అప్పుడు టిక్‌టాక్‌ను కొనుగోలు చేద్దామని రిలయన్స్ భావిస్తోంది.
అయితే మరోవైపు మైక్రోసాఫ్ట్ టిక్‌టాక్‌కు చెందిన ఇండియా బిజినెస్‌తోపాటు ప్రపంచ వ్యాప్త బిజినెస్‌ను కొనాలని చూస్తోంది. కానీ అక్కడ సెప్టెంబర్ 15ను డెడ్‌లైన్‌గా విధించడంతో మైక్రోసాఫ్ట్ ఈ విషయంపై అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంత భారీ డీల్‌ను ముగించాలంటే తమకు మరికొంత సమయం కావాలని ఆ సంస్థ ట్రంప్ ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిసింది. కాగా భారత్‌లో టిక్‌టాక్ సొంతంగా మళ్లీ రంగ ప్రవేశం చేసేందుకు అవకాశం లేకపోవడంతో.. ఇతర సంస్థలకు టిక్‌టాక్ లో వాటాను అమ్మడం లేదా.. ఇండియా బిజినెస్‌ను పూర్తిగా అమ్మడం.. ద్వారా మళ్లీ భారత్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ఆలోచిస్తోంది. మరి రిలయన్స్ టిక్‌టాక్‌ను కొనుగోలు చేస్తుందా, లేదా అన్నది చూడాలి.