ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ (73) కన్నుమూశారు. బ్లడ్ ప్రెషర్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన 2 వారాల క్రితం శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. తబలా మ్యాస్ట్రోగా పేరొందిన జాకీర్ హుస్సేన్ 1951 మార్చి 9న ముంబైలో జన్మించారు.తన తండ్రి అల్లారఖా బాటలోనే జాకీర్‌హుస్సేన్ నడిచాడు. చిన్నతనం నుంచే తబలా నేర్చుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, జాజ్ ఫ్యూజన్‌లో నైపుణ్యం సాధించి తనదైన ముద్ర వేశారు. ఆదివారం రాత్రి ఆయన మరణించినట్లు వార్తలు రాగా, దానిని వారి కుటుంబ సభ్యులు ఖండించారు. తాజాగా సోమవారం ఉదయం ఆయన మరణాన్ని ధ్రువీకరించారు. జాకీర్ హుస్సేన్ 1990లో సంగీత్‌నాటక అకాడమీ అవార్డు, 2009లో గ్రామీ పురస్కారం అందుకున్నారు. 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్‌తో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను గౌరవించింది.