టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు..ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని రేసులోకి తీసుకురావాలని రేవంత్ కష్టపడుతున్నారు. ఇదే క్రమంలో తనదైన శైలిలో పాదయాత్ర మొదలుపెట్టిన రేవంత్.. కాంగ్రెస్ బలం మరింత పెంచేలా ముందుకెళుతున్నారు. పాదయాత్రకు ప్రజా స్పందన బాగా వస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో అధికార బిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ విరుచుకుపడుతున్నారు. అటు బిజేపిని సైతం వదలడం లేదు.
ఇలా తనదైన శైలిలో దూసుకెళుతున్న రేవంత్..కొన్ని స్టేట్మెంట్స్ వ్యూహాత్మకంగా చేస్తున్నారు. ఓ వైపు పాదయాత్రలో ఎన్నికల హామీలు ఇస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని అన్నారు. అలాగే గ్యాస్ సిలిండర్ రూ.500కే ఇస్తామని, 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇలా కీలక హామీలు ఇస్తూ ప్రజలని ఆకర్షిస్తున్న రేవంత్..ఓట్లని రాబట్టడానికి కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ళు కట్టున్న వూరిలో తాము ఓట్లు అడుగుతామని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఉన్న వూరిలో బిఆర్ఎస్ ఓట్లు అడగాలని అన్నారు.
అంటే గతంలో కాంగ్రెస్ ఇందిరమ్మ ఇళ్ళు ఎక్కువ కట్టించింది..కానీ ఇప్పుడు కేసిఆర్ ప్రభుత్వం..డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఎక్కువ కట్టలేదు. అందుకే రేవంత్ ఈ సవాల్ చేశారు. అలాగే రుణమాఫీ జరిగిన రైతులు బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తారని, జరగని రైతులు కాంగ్రెస్కు వేయాలని, దళితబంధు అందిన దళితులు బిఆర్ఎస్కు, అందని వారు కాంగ్రెస్ వైపు ఉంటారని అంటున్నారు.
అంటే బిఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు పెద్దగా ఏమి చేయలేదని చెప్పడానికి రేవంత్ ఈ తరహా సవాళ్ళు విసురుతున్నారని తెలుస్తోంది. అయితే రేవంత్ సవాళ్ళలో లాజిక్ ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఈ సవాల్ని గాని బిఆర్ఎస్ స్వీకరిస్తే.ఆ పార్టీకే నష్టమని, అలా అంటే ఓట్లు పెద్దగా పడవని అంటున్నారు.