తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నికపై దృష్టి సారించింది. ఎందుకంటే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న టీఆర్‌ఎస్‌కు ఇప్పుడు ఈ ఉప ఎన్నిక ప్రాధన్యమైంది. దీంతో మునుగోడులో గెలుపే లక్ష్యంగా అధికార టీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరఫున ప్రచారం కోసం టీపీసీసీ రేవంత్ రెడ్డి కొయ్యలగూడెంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ… సీఎం కేసీఆర్ కు మహిళలంటే చిన్నచూపు అని, మునుగోడులో ఒక ఆడబిడ్డకు అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒక ఆడబిడ్డకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే, సమస్యలపై పోరాడుతూ ప్రజల పక్షాన నిలుస్తుందని అన్నారు.
ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీలను గెలిపిస్తే మార్పేమీ ఉండదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీని వీడి, ముగ్గురు ఉన్న పార్టీలోకి వెళ్లారని, ఏం అభివృద్ధి జరుగుతుందని పార్టీ మారారో ఆయనకే తెలియాలని అన్నారు. ప్రజలు నమ్మి ఓట్లేసిన వారు ఇవాళ సంతలో పశువుల్లా అమ్ముడుపోయారని రేవంత్ విమర్శించారు. అలాంటి వారి వెంట మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఉండరని భావిస్తున్నా అంటూ వ్యాఖ్యానించారు.