టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజ్ అంశంలో ట్విస్ట్ లు నడుస్తూనే ఉన్నాయి. లీకేజ్ అంశంలో నిందితులుగా ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక దీనిపై లోతుగా విచారణ చేస్తున్నారు. అయితే ఈ పేపర్ లీకేజ్ అంశం కాస్త రాజకీయంగా మారిపోయింది. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. పేపర్ లీకేజ్ అంశంలో కేటిఆర్ కు సంబంధం ఉందని అటు బండి సంజయ్, ఇటు రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ఈ కేసులో నిందితుడుగా ఉన్న రాజశేఖర్..కేటిఆర్ పిఏ తిరుపతి రెడ్డి సన్నిహితుడు అని..ఇందులో అతన్ని కూడా విచారించాలని, కేటిఆర్ సైతం ఇందులో ఉన్నారని రేవంత్ ఆరోపించారు. అయితే ఇలా ఆరోపణలు చేయడంతో అటు బండి..ఇటు రేవంత్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. అదే సమయంలో ఈ కేసులో బిజేపి నేతలకు సంబంధం ఉన్న కేటిఆర్ కు మాత్రం నోటీసులు ఇవ్వలేదు. కేవలం బండి, రేవంత్ లకు నోటీసులు ఇచ్చి..ఈ కేసులో ఆధారాలు ఉంటే ఇవ్వాలని సిట్ కోరింది.
ఈ క్రమంలో నేడు రేవంత్ సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు సిట్ ఆఫీసు ముందుకు వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. కానీ పోలీసులు ఎక్కడకక్కడ కాంగ్రెస్ నేతలని హౌస్ అరెస్ట్ చేయడం, కార్యకర్తలని అదుపులోకి తీసుకోవడం చేస్తున్నారు. దీంతో రేవంత్..పోలీసులపై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కో న్యాయం, కాంగ్రెస్ కో న్యాయం అన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో ఈడీ కార్యాలయం వద్దకు బీఆర్ఎస్ నేతలు వెళ్ళలేదా? అని ప్రశ్నించారు.
మరి మమ్మల్ని సిట్ వద్దకు వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో తాను ఆధారాలతో వెళుతుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఆధారాలు సమర్పిస్తే కేసీఆర్ కుటుంబం దోషిగా తేలుతుందని భయపడుతున్నారని అన్నారు.