రాజకీయాల్లో పార్టీ మార్పులు సహజమే. ప్రతిపక్షంలో ఉండే ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి జంప్ అవుతూ ఉంటారు. చాలాకాలం నుంచి ఈ జంపింగ్ సంస్కృతి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. అయితే ఈ జంపింగుల విషయంపై తెలంగాణ పీసీసీ రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) తీవ్రంగా స్పందిస్తున్నారు. సీఎం కేసీఆర్, సంతలో పశువులను కొన్నట్లుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నారని, అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు పదవికి రాజీనామా చేసి దమ్ముంటే ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు.
కాంగ్రెస్ నుంచి గెలిచి అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలని చెప్పి రేవంత్ రెడ్డి పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చారు. అయితే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇక 19 మందిలో 12 మంది ఎమ్మెల్యే గులాబీ పార్టీలోకి జంప్ చేశారు. అసలు చాలా ఏళ్ళు కాంగ్రెస్‌కు వీర విధేయులుగా ఉన్న వారు కూడా అధికార టీఆర్ఎస్‌లోకి వెళ్ళిపోయారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితి ఘోరంగా తయారవ్వడం, సీఎం కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా వారు జంప్ కొట్టేశారు.
ఆఖరికి కాంగ్రెస్ నుంచి వచ్చిన సబితా ఇంద్రారెడ్డికి కేసీఆర్ మంత్రి పదవి సైతం ఇచ్చారు. ఇలా కాంగ్రెస్‌ని వీడి టీఆర్ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలని టార్గెట్ చేసుకుని రేవంత్ ముందుకెళుతున్నారు. ఇంతకాలం జంపింగ్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి ఎదురుదాడి జరగలేదు. కానీ ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు అయ్యాక రేవంత్ వారినే టార్గెట్ చేశారు.
ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ని కోరుతున్నారు. అది కుదరని పక్షంలో స్పీకర్‌పైనా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కూడా చెబుతున్నారు. ఇలా రేవంత్ 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించేలా పావులు కదుపుతున్నారు. మరి ఈ విషయంలో రేవంత్ ఏ మేర సక్సెస్ అవుతారో చూడాలి.