రేవంత్ ఒక్క ఛాన్స్..టార్గెట్ 100.!

-

రాజకీయాల్లో ఒక్క ఛాన్స్ అనే మాట ఎక్కువైంది..అధికారంలోకి రాని పార్టీలు ప్రజలని ఒకే ఒక్క ఛాన్స్ అడుగుతున్నారు. ఒక్కసారి తమకు అవకాశం ఇచ్చి చూడాలని కోరుతున్నారు. ఈ ఒక్క ఛాన్స్ అనేది ప్రజల్లో సెంటిమెంట్ లేపడానికి బాగా ఉపయోగపడుతుంది. పార్టీలు సైతం సెంటిమెంట్ గా ఒక్క ఛాన్స్ అడుగుతున్నాయి. దీంతో ప్రజలు కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వాలనే ఆలోచనలోకి వస్తున్నారు. ఏపీలో గత ఎన్నికల ముందు అలాగే జగన్ ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలని అడిగిన విషయం తెలిసిందే.

ఒక్క ఛాన్స్ ఇస్తే తన పాలన ఏంటో చూపిస్తానని అన్నారు. దీంతో ప్రజలు కూడా జగన్ పాలన ఇంతవరకు చూడలేదు కదా..ఆయనకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలని చెప్పి..ఒక్క ఛాన్స్ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చారు. ఇక ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ పాలన ఎలా ఉందో ప్రజలు చూస్తున్నారు. ఆ విషయం పక్కన పెడితే..ఇటు ప్రతిపక్షంలోకి వెళ్ళిన తెలుగుదేశం పార్టీ సైతం తమకు ఈ సారి ఛాన్స్ ఇవ్వాలని కోరుతుంటే. అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్..తమకు కూడా ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడాలని అంటున్నారు.

అది ఏపీలో అలా ఉంటే..తెలంగాణ రాజకీయాల్లో కూడా ఒక్క ఛాన్స్ మాట నడుస్తోంది. ఇప్పటికే బీజేపీ ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడాలని అంటుంటే..ఇప్పుడు కాంగ్రెస్ సైతం అదే నినాదం అందుకుంది. తాజాగా టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని, తెలంగాణ తెచ్చినట్లు చెప్పుకొంటున్న కేసీఆర్‌కు రెండు సార్లు అవకాశం ఇచ్చి.. జనం మోసపోయారని,  వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 100 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

అలాగే సమష్టిగా 10 నెలలు కష్టపడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అదే సమయంలో ఎన్నికల హామీలని కూడా ఇచ్చారు. అధికారంలోకి రాగానే పేదల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వంలో 2 లక్షలు ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, తాము వచ్చిన ఏడాదిలోగా వాటిని భర్తీ చేస్తామని, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మహిళలకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని, రాష్ట్రవ్యాప్తంగా బీసీ విద్యార్థులకు ఇవ్వాల్సిన రూ.5 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలనూ చెల్లిస్తామని తెలిపారు.

అదేవిధంగా రూ.800 కోట్లు ఉన్న ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించి, రూ.2 లక్షలుగా ఉన్న ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.5 లక్షల వరకు పెంచుతామని ప్రకటించారు. ఇలా కీలక హామీలు ఇచ్చారు. మరి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇస్తారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version