తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ సీనియర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. అప్పులు పుట్టడం లేదని ఇటీవల సీఎం రేవంత్ చెప్పగా.. అప్పులు పుట్టకపోతే ముఖ్యమంత్రిగా ఆయన ఫెయిల్ అయినట్లే అని అన్నారు. పాలన చేత కాకపోతే దిగిపోవాలని సీఎంకు హరీష్ రావు హితవు పలికారు.
బుధవారం సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడ్‌లోని ఐకేపీ సెంటర్‌లో వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. కలెక్టర్, ఆర్డీవో, సివిల్ సప్లై అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తడిచిన ధాన్యంను కొనుగోలు చేయాలని కోరారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలులో పూర్తిగా విఫలం అయిందన్నారు. హైదరాబాద్‌లో కూర్చొని అందాల పోటీలపై రివ్యూలు చేస్తున్న సీఎం రేవంత్.. రైతులు అప్పులు తెచ్చి పండించిన పంట.. అకాల వర్షాలకు మొలకెత్తుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇకపై సీఎం రేవంత్ చిల్లర మాటలు మానుకోవాలన్నారు.ధాన్యాన్ని త్వరగా కొనాలని డిమాండ్ చేశారు.