టీపీసీసీ ఛీఫ్ గా ఎన్నికైన రేవంత్ రెడ్డికి సొంత పార్టీ నుంచే తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. రేవంత్ రెడ్డికి కెప్టెన్ పదవి కట్టబెట్టడాన్ని జీర్ణించుకోలేని కొందరు కాంగ్రెస్ నేతలు పార్టీకి రాజీనామాలు కూడా చేశారు. ఇక నల్గొండ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అయితే ఏకంగా కాంగ్రెస్ అధిష్టానం పైనే తీవ్ర విమర్శలు గుప్పించారు. పదవిని అమ్ముకున్నారని ఆరోపించారు. తాను ఇకపై భవిష్యత్ లో గాంధీ భవన్ గడప తొక్కనని స్పష్టం చేశారు.
దీంతో వీరందరినీ బుజ్జగించాలని రేవంత్ రెడ్డి బయలు దేరారు. వరుస పెట్టి కాంగ్రెస్ సీనియర్ నాయకులను కలిసి మంతానాలు జరుపుతున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీపై ఘాటు విమర్శలు చేస్తూ… వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కురు వృద్ధుడు వీ హనుమంతరావును ఆసుపత్రిలో పరామర్శించారు. ఆయన ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూడా టీఆర్ఎస్ పై విమర్శల బాణాలను ఎక్కుపెట్టారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన దళిత ఎంపవర్ మెంట్ పెద్ద మోసమని ఆరోపించారు. నియోజకవర్గానికి కేవలం వంద దళిత కుటుంబాలకు సాయం చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు.
ఇక వీ. హనుమంతరావును కొనియాడారు . ఆయన ఆసుపత్రిలో ఉన్నా.. దళితుల సంక్షేమం గురించే ఆలోచిస్తున్నారని… వారి సమస్యలపై ప్రభుత్వం స్పందించే వరకు పోరాడాలని తనకు సూచించారని తెలిపారు. వీ హనుమంతరావుకు రేవంత్ రెడ్డికి అంతలా పడేది కాదు. కానీ పీసీసీ ఛీఫ్ గా రేవంత్ రెడ్డిని ప్రకటించిన తర్వాత పార్టీలో ఉన్న అందర్ని కలుపుకు పోయేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. వరుసగా కాంగ్రెస్ సీనియర్లతో మంతనాలు జరుపుతున్నారు. త్వరలో జరిగే హుజురాబాద్ ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టారు. కేసీఆర్ పాలనలో జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్ పోరాడుతుందని స్పష్టం చేశారు.