సుశాంత్ సింగ్ మృతి కేసులో డ్రగ్స్ కోణం ఉందన్న నేపథ్యంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ప్రస్తుతం డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రియా చక్రవర్తిని మంగళవారం ఎన్‌సీబీ అరెస్టు చేసింది. గత 2 రోజుల కిందటే రియా సోదరుడు షౌవిక్ చక్రవర్తి, సుశాంత్ ఇంటి మేనేజర్ శామ్యూల్ మిరాండాలను ఎన్‌సీబీ అరెస్టు చేసింది. అయితే రియాను మంగళవారం ఎన్‌సీబీ అరెస్టు చేసిన అనంతరం ఆమె లాయర్ మీడియాతో మాట్లాడుతూ.. సుశాంత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రియా చక్రవర్తిని ఎన్‌సీబీ అరెస్టు చేసిన అనంతరం ఆమె లాయర్ సతీష్ మనేషిండే మీడియాతో మాట్లాడుతూ.. రియాను అరెస్టు చేయడం వల్ల న్యాయవ్యవస్థ అపహాస్యం అవుతుందన్నారు. సుశాంత్ లాంటి ఓ డ్రగ్స్ వ్యసనపరున్ని ప్రేమించడమే రియా చేసిన తప్పు అని, అందుకు ఆమెను 3 సెంట్రల్ ఏజెన్సీలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆరోపించారు.
కాగా సుశాంత్ సింగ్ మృతి డ్రగ్స్ కేసులో ఎన్‌సీబీ గత కొద్ది రోజుల నుంచి రియాను, ఆమె సోదరుడు షౌవిక్‌ను, ఇతరులను ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలో ముందుగా షౌవిక్‌ను, శామ్యూల్ మిరాండాను, పలువురు ఇతరులను కూడా ఎన్‌సీబీ అరెస్టు చేసి వారిని కోర్టులో హాజరు పరచగా.. వారిని కోర్టు పోలీస్ కస్టడీకి అప్పగించింది. ఇక మంగళవారం కూడా రియాను ఎన్‌సీబీ విచారించి.. ఏకంగా ఆమెను అరెస్టు చేసింది. దీంతో ఈ కేసు ఇవాళ కొత్త మలుపు తిరిగింది. అయితే రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.