కరోనా వ్యాక్సిన్ నేపథ్యంలో ముందు నుంచి అందరూ ఊహించినట్లుగానే పరిస్థితులు మారుతున్నాయా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే.. వ్యాక్సిన్ అంటూ అందుబాటులోకి వస్తే ముందుగా ధనిక దేశాలకు అది లభిస్తుందని, పేద దేశాలు ఈ విషయంలో వెనుకబడి పోతాయని ఎప్పటి నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతూ వస్తోంది. అయితే ఇప్పుడదే విషయం నిజమవుతోంది. ప్రపంచం మొత్తం మీద ఉన్న ఫార్మా కంపెనీలు ఉత్పత్తి చేయనున్న మొత్తం కరోనా వ్యాక్సిన్ డోసుల్లో సగం డోసులను ఇప్పటికే ధనిక దేశాలు కొనుగోలు చేసినట్లు అధ్యయనంలో తేలింది.
ప్రపంచ జనాభాలో 13 శాతం వరకు ఉన్న ధనిక దేశాలు మొత్తం ఉత్పత్తి కానున్న కరోనా వ్యాక్సిన్ డోసుల్లో సగం డోసులను ఇప్పటికే కొన్నాయని, ఆ మేరకు ఆయా దేశాలు ఫార్మా కంపెనీలతో ఇప్పటికే డీల్స్ ను కుదుర్చుకున్నాయని.. ఆక్స్‌ఫాం అనే సంస్థ వెల్లడించిన నివేదికలో తేలింది. ప్రపంచంలో ప్రస్తుతం ముందు వరుసలో ఉన్న 5 కరోనా వ్యాక్సిన్ తయారీదారులతో పలు దేశాలు కుదుర్చుకున్న డీల్స్ కు చెందిన వివరాలను అధ్యయనం చేసి ఆ సంస్థ ఆ నివేదికను విడుదల చేసింది.
ఆస్ట్రాజెనెకా, గమాలయా, మోడెర్నా, ఫైజర్, సినోవాక్ వంటి కంపెనీలు మొత్తం 5.9 బిలియన్ల డోసులను ఉత్పత్తి చేయగలవని, అయితే అందులో 5.3 బిలియన్ డోసులను ఇప్పటికే అమెరికా, యూకే, యురోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా, హాంగ్‌కాంగ్, మకావ్, జపాన్, స్విట్జర్లాండ్, ఇజ్రాయెల్ దేశాలు కొన్నాయని, అందుకు ఆయా కంపెనీలతో ఆ దేశాలు డీల్స్ ను కుదుర్చుకున్నాయని తేలింది. ఇక మిగిలిన డోసుల కోసం ఇండియా, బంగ్లాదేశ్, చైనా, బ్రెజిల్, ఇండోనేషియా, మెక్సికో దేశాలు డీల్స్ ను కుదుర్చుకున్నట్లు వెల్లడైంది. ఈ క్రమంలో పేద దేశాలకు ఇప్పుడప్పుడే కరోనా వ్యాక్సిన్ లభించే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది.