Rich Ganesha : అత్యంత ఖరీదైన గణేశ్ మండపం ఎక్కడుందో తెలుసా..?

-

దేశమంతా గణపతి నవరాత్రుల ఉత్సవాల ఏర్పాట్లలో నిమగ్నమైంది. యువకులంతా గణేశ్ మండపాలు ఏర్పాటు చేయడంలో బిజీగా ఉన్నారు. పోటాపోటీగా అందంగా.. మండపాలు అలంకరిస్తూ సందడి చేస్తున్నారు. వినాయక చవితికి కేవలం గణపయ్య విగ్రహం ఎత్తులోనే కాదు.. గణేశ్ మండపాల అలంకరణ, సెట్టింగ్ లో విషయంలోనూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో అయితే సినిమా సెట్టింగులను తలపించేలా మండపాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ముంబయిలో అయితే గణేశ్ నవరాత్రుల సంబురాలు అంబరాన్నంటుతాయి. ఇక ఇక్కడి గణపతి మండపాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ముంబయిలో అత్యంత ఖరీదైన ఓ గణేశ్ మండపం ఉంది. దీనికి ఏకంగా రూ.316 కోట్ల ఇన్సూరెన్స్ చేయించారు. మరి దీని స్టోరీ ఏంటో తెలుసుకుందామా..?

 

మహారాష్ట్రలో గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఏటికేడు గణేశ్ సంబురాల్లో జోష్ పెరుగుతూనే ఉంటుంది. కరోనాతో గత రెండేళ్లు గణపతి నవరాత్రులు బోసిపోయాయి. గతేడాది కూడా సగం ఆంక్షల నడుమ అంత వైభవంగా వేడుకలు జరుపుకోలేదు. అందుకే ఈ ఏడాది ఫుల్ జోష్ తో .. గణపతి నవరాత్రి వేడుకలు జరుపుకునేందుకు ముంబయి వాసులు సిద్ధమవుతున్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. గణేశ్ మండపాలు. ముంబయిలో ఎక్కడ చూసినా సినిమా సెట్టింగులను తలపించే గణపతి మండపాలు కనిపిస్తూ ఉంటాయి. దీనికోసం వారు భారీగా ఖర్చు చేస్తుంటారు.

ముంబయిలోని కింగ్స్‌ సర్కిల్‌లో జీఎస్‌బీ సేవా మండల్‌ నగరంలోనే అత్యంత ఖరీదైన మండపంగా నిలిచింది. ఆ మండపం బాధ్యతలు చూసేవారితో పాటు అక్కడకు వచ్చే భక్తులకు అక్కడి నిర్వాహకులు భారీ బీమా చేయించారు. ఇందుకోసం రూ.316కోట్ల మొత్తానికి ఇన్సూరెన్స్‌ చేయించగా.. ఇందులో రూ.31.97కోట్లు మండపంలోని బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులు ఈ పరిధిలోకి వస్తాయి. మరో రూ.263 కోట్లు మాత్రం మండపానికేనని నిర్వాహకులు వెల్లడించారు. వీరిలో వాలంటీర్లు, పూజారులు, వంటవాళ్లు, చెప్పులు భద్రపరిచేవారు, పార్కింగ్‌, సెక్యూరిటీ సిబ్బంది ఈ బీమా కిందకు వస్తారు. అగ్నిప్రమాదం, భూకంపం ముప్పు వంటి వాటికోసం ప్రత్యేకంగా మరో కోటి రూపాయల బీమా తీసుకున్నారు. వీటిలోకి అక్కడి ఫర్నీచర్‌, కంప్యూటర్లు, సీసీటీవీలు, స్కానర్ల వంటివి వస్తాయి.

 

‘మండప నిర్వాహకులతో పాటు ఈ గణేశుడిని దర్శించుకునేందుకు వచ్చే ప్రతి భక్తుడికి బీమా కల్పించాం. గత 68 ఏళ్లుగా ఇక్కడ వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడకు వచ్చే ప్రతి భక్తుడికి భద్రత కల్పించడం మా బాధ్యత’ అని జీఎస్‌బీ సేవా మండల్‌ ఛైర్మన్‌ విజయ్‌ కామత్‌ పేర్కొన్నారు. వినాయక చవితి మొదలు 10రోజుల పాటు ఇక్కడి నిర్వాహకులు, భక్తులకు ఈ బీమా వర్తిస్తుందన్నారు. ఏటా ఇటువంటి ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్నప్పటికీ ఈసారి రికార్డు స్థాయిలో గరిష్ఠ మొత్తానికి బీమా చేయించినట్లు మండపం నిర్వాహకులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version