నెటిజ‌న్ల‌ను స‌హాయం కోరిన పంత్‌.. అభిమానులు ఏమ‌ని బ‌దులిచ్చారంటే..?

-

ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న ముగించుకుని వచ్చిన అనంత‌రం టీమిండియా ఆట‌గాళ్లు అనేక చోట్ల‌కు వెళ్తూ స‌ర‌దాగా గ‌డుపుతున్నారు. శిఖ‌ర్ ధావ‌న్ ఆధ్యాత్మిక క్షేత్రాల‌ను సంద‌ర్శిస్తుండ‌గా.. రిష‌బ్ పంత్ త‌న ఫేవ‌రెట్ క్రికెట‌ర్ ధోనీ ఫ్యామిలీతో క‌లిసి ప‌లు పార్టీ వేడుక‌ల్లో పాల్గొంటున్నాడు. ఇక పంత్ తాజాగా ట్విట్ట‌ర్‌లో త‌న అభిమానుల‌ను ఓ స‌హాయం అడిగాడు.

ఇండియ‌న్ క్రికెట్ టీం వికెట్ కీప‌ర్ బ్యాట్స్‌మ‌న్ రిష‌బ్ పంత్ ట్విట్టర్ ద్వారా త‌న అభిమానుల‌ను స‌హాయం కోరాడు. తాను ఇల్లు కొనుగోలు చేయ‌ద‌లిచాన‌ని, ఎక్క‌డ ఇంటిని కొంటే బాగుంటుందో చెప్పాల‌ని అడిగాడు. ఈ మేర‌కు పంత్ ట్వీట్ చేశాడు. ఆస్ట్రేలియా నుంచి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఒక కొత్త ఇంటిని కొన‌మ‌ని త‌న కుటుంబ స‌భ్యులు అడుగుతున్నార‌ని, అందుకే ఇంటిని కొనుగోలు చేద్దామ‌నుకుంటున్నాన‌ని, గుర్గావ్‌లో అయితే ఎలా ఉంటుంది ? లేదా ఇంకా ఎక్క‌డైనా కొన‌వ‌చ్చా ? అని ట్వీట్ చేశాడు.

అయితే పంత్ చేసిన ట్వీట్‌కు నెటిజ‌న్లు స‌రదాగా స్పందించారు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానం సమీపంలో ఇంటిని తీసుకో.. ఐపీఎల్ జ‌రిగిన‌ప్పుడు సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది.. అని ఒక వ్య‌క్తి సూచించాడు. అలాగే.. కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌ల‌కు ఇలాంటి ప్ర‌శ్న‌ను ట్విట్ట‌ర్‌లో అడిగే ధైర్యం లేద‌ని.. మ‌రొక యూజ‌ర్ కామెంట్ చేశాడు. ఇలా అనేక మంది భిన్న ర‌కాలుగా స్పందిస్తున్నారు.

కాగా ఆస్ట్రేలియా సిరీస్‌లో పంత్ మ‌ర‌పురాని ఇన్నింగ్స్ ఆడాడు. సిడ్నీ టెస్టు మ్యాచ్‌లో మ‌రికొద్ది సేపు అత‌ను బ్యాటింగ్ చేసి ఉంటే ఇండియా ఖాతాలో ఇంకో విజ‌యం ప‌డి ఉండేది. అయిన‌ప్ప‌టికీ బ్రిస్బేన్ టెస్టు మ్యాచ్‌లో పంత్ వీరోచిత ఇన్నింగ్స్ వల్ల భార‌త్ ఆ టెస్టు మ్యాచ్‌లో సునాయాసంగా గెలిచి సిరీస్‌ను కైవ‌సం చేసుకోగ‌లిగింది. దీంతో పంత్‌కు అభిమానులు పెరిగిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version