టీం ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు ఇటీవల యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ టీం ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ దాదాపు ఈ ఏడాదంతా ఆటకు దూరం కానున్నాడు. బీసీసీఐ కి వైద్యబృందం అందించిన తాజా నివేదిక ప్రకారం పంత్ మోకాలికి మరో శస్త్ర చికిత్స అవసరమని తెలుస్తోంది. కారు ప్రమాదంలో పంత్ మోకాలిలోని మూడు కీలక స్నాయువులు దెబ్బతిన్నాయి.
ఇటీవల శస్త్ర చికిత్సలు రెండు స్నాయువుల్ని సరి చేశారు. మూడో స్నాయువుల్ని సరి చేసేందుకు సుమారు ఆరు వారాల తర్వాత మరో శస్త్ర చికిత్స చేయనున్నారు. అందుకని ఆరు నెలలు ఆటకు దూరమవ్వచ్చని నివేదికలో వైద్యులు పేర్కొన్నారు. దీంతో ఐపీఎల్ లో ఆడే అవకాశం లేని పంత్, అక్టోబర్, నవంబర్ లో భారత్ తో జరిగే వన్డే ప్రపంచ కప్ కు పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడా అన్నది అనుమానమే. ప్రపంచకప్ కు కూడా అందుబాటులో లేకపోతే 2023లో ఎక్కువ కాలం ఆటకు అతను దూరమవుతాడు.