అప్పటినుంచి బోరిస్ నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు : రిషి సునాక్

-

బ్రిటన్ ప్రధాని రేసులో తన ప్రచారాన్ని హోరుగా సాగిస్తున్నారు రిషి సునాక్. ఆయన గురువారం రాత్రి ఇంగ్లాండ్ లోని చెల్టెన్ హామ్ లో టోరీ సభ్యులతో చర్చలో పాల్గొన్నారు. ఈ చర్చలో ఆయన మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాజీనామా చేసినప్పటినుంచి బ్రిటన్‌ మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తన మెసేజ్‌లు, ఫోన్‌ కాల్స్‌కు స్పందించడం లేదని రిషి తెలిపారు.

పార్టీగేట్‌ కుంభకోణంలో బోరిస్‌ జాన్సన్‌ పార్లమెంటును తప్పుదోవ పట్టించారా? లేదా? అన్న విషయంపై కొనసాగుతోన్న పార్లమెంటరీ విచారణపై సునాక్‌ అభిప్రాయాన్ని కోరగా.. ‘ఇది పూర్తిగా పార్లమెంటరీ ప్రక్రియ. ప్రభుత్వ ప్రక్రియ కాదు. కామన్స్‌ ప్రివిలెజెస్‌ కమిటీలోని ఎంపీలను గౌరవిస్తా. వారు సరైన నిర్ణయాలు తీసుకుంటారు’ అని బదులిచ్చారు.

‘వ్యక్తిగతంగా నేను ఉన్నత ప్రమాణాలను విశ్వసిస్తా. ప్రధానమంత్రి అయిన వెంటనే నేను మంత్రివర్గ ప్రయోజనాల కోసం స్వతంత్ర సలహాదారుడిని తిరిగి నియమిస్తాను. విశ్వాసం, చిత్తశుద్ధి, మర్యాదలు.. రాజకీయ ఆత్మకు సంబంధించిన అంశాలు’ అని పేర్కొన్నారు. దీంతో టోరీ సభ్యులనుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

ఇదిలా ఉండగా.. శుక్రవారం వేల్స్ పర్యటనలో ఉన్న బోరిస్‌ జాన్సన్‌కు సునాక్‌ సందేశాలు, ఫోన్‌ కాల్స్‌ విషయమై ప్రశ్నలు ఎదురుకాగా.. ఆయన వాటిని దాటవేశారు. బోరిస్‌ నాయకత్వంపై విశ్వాసం కోల్పోయానని చెబుతూ.. గతంలో ఆర్థిక మంత్రిగా ఉన్న రిషి సునాక్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తదనంతర పరిణామాలు బోరిస్‌ రాజీనామాకు దారితీశాయి. ప్రస్తుతం ప్రధాని పదవికి లిజ్‌ ట్రస్‌, రిషి సునాక్‌ తుది పోటీలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version