- డిప్యుటేషన్లను మూడేళ్లకే పరిమితం
- ఉద్యోగుల సమస్యలపై అధ్యయనానికి కమిటీ
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి భేటీ ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టిటిడి ఉద్యోగులకు పరకామణి విధులు వేయకూడదని, మూడేళ్లు దాటి తిరుమలలో పనిచేస్తున్నవారిని తిరుపతికి బదిలీ చేయాలని నిర్ణయించారు. తితిదే ఉద్యోగులు ఆగస్టు మాసంలో కొన్ని సమస్యలు పరిష్కరించాలని టిటిడి పాలకమండలికి సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అప్పట్లోనే టిటిడి ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్ సింఘాల్ ఉద్యోగులతో చర్చించారు. దీంతో వారి సమస్యలన్నీ చర్చిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన బోర్డు సమావేశంలో కార్మికులకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
టిటిడి పాలకమండలి నిర్ణయాలివే..
– తితిదేలోని రెగ్యులర్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వృత్తిపరంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఒక కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
– తిరుమలలోని వసతిగృహాల ఆధునీకరణ, ఇతర మౌలిక సౌకర్యాల కల్పనకు తితిదే బోర్డు ఎఫ్‌ఎంఎస్ సబ్ కమిటీ చేసిన సిఫార్సులను ఆమోదించింది. ఇందుకు రూ.112 కోట్లు ఖర్చు కానుంది.
– తితిదే విద్యాసంస్థల్లోని బోధనా సిబ్బందికి పదవీ విరమణ లేదా మరణించిన సందర్భాలలో ఆర్జిత సెలవు (Earned Leave) మరియు అర్ధ వేతన సెలవుల (Half pay Leave) నగదు మార్పిడికి సంబంధించి జీవో నం. 90 అమలుచేసేందుకు నిర్ణయం.
– తితిదే ఆధ్వర్యంలోని జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఆదరణ ఎక్కువగా ఉన్న గ్రూపులలో సీట్ల సంఖ్యను పెంచేందుకు, ఆదరణ తక్కువగా ఉన్న గ్రూపులలో సీట్ల సంఖ్యను తగ్గించేందుకు ఆమోదం.
– తితిదే సిబ్బంది విజ్ఞప్తి మేరకు వారికి పరకామణి డిప్యూటేషన్ విధులను రద్దు చేసేందుకు ఆమోదం.
– ఫారిన్ సర్వీసు నుండి తితిదేకి వచ్చిన ఉద్యోగులను 3 సంవత్సరాల కాలపరిమితి అయిన తరువాత మాతృ సంస్థకు బదిలీ చేయాలని నిర్ణయం. ఒకసారి వచ్చిన వారిని రెండోసారి విధుల్లోకి తీసుకోరాదని నిర్ణయం.
– ఒకేచోట మూడు సంవత్సరాలు విధులు నిర్వహించిన తితిదే ఉద్యోగులను మరో విభాగానికి బదిలీ చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం నవంబరు 1 నుంచి అమల్లోకి వస్తుంది.
– అలిపిరి వద్ద భక్తుల సౌకర్యార్థం మొదటి దశలో రూ.120 కోట్లతో దాదాపు 500 గదులతో వసతి సముదాయం నిర్మించేందుకు ఆమోదం.
ఈ సమావేశంలో తితిదే ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ మన్‌మోహన్ సింగ్, కమిషనర్ డా. ఎం.పద్మ, ధర్మకర్తల మండలి సభ్యులు సుధా నారాయణమూర్తి, రాయపాటి సాంబశివరావు, బీకే పార్థసారధి, బోండా ఉమామహేశ్వరరావు, ఇ.పెద్దిరెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, డొక్కా జగన్నాథం, రుద్రరాజు పద్మరాజు, మేడా రామకృష్ణారెడ్డి, చల్లా రామచంద్రారెడ్డి, జీఎస్‌ఎస్.శివాజి, ప్రత్యేక ఆహ్వానితులుగా కె.రాఘవేంద్రరావు, ఎన్.శ్రీకృష్ణ, తిరుమల జేఈవో కె.ఎస్.శ్రీనివాసరాజు, తిరుపతి జేఈవో పోల భాస్కర్ పాల్గొన్నారు.