రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) ఎన్టీపీసీ ఎగ్జామ్‌కు గాను ఆ బోర్డు తాజాగా ఎగ్జామ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఆర్ఆర్‌బీ నోటీసు ప్రకారం డిసెంబర్ 24వ తేదీ వరకు అడ్మిట్ కార్డులను ఇస్తారని తెలుస్తుండగా, పరీక్షా కేంద్రాల వివరాలను నేడో, రేపో వెల్లడిస్తారని తెలిసింది. ఇక ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్‌ను డిసెంబర్ 28 నుంచి జనవరి 13వ తేదీ వరకు నిర్వహిస్తారు. మొదటి దశలో భాగంగా మొత్తం 23 లక్షల మంది అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత టెస్టులో పాల్గొంటారు.
ఇక ఈ పరీక్షలకు గాను మిగిలిన అర్హత సాధించిన విద్యార్థులకు దశలవారీగా ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఈ ఎగ్జామ్‌కు మొత్తం 1.25 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారని ఆర్ఆర్‌బీ వెల్లడించింది. ఆర్ఆర్‌బీ నోటీసు ప్రకారం ఎగ్జామ్‌కు 4 రోజుల ముందు అడ్మిట్ కార్డును అప్‌లోడ్ చేస్తారు. అంటే డిసెంబర్ 24వ తేదీ వరకు ఆ ప్రక్రియ జరుగుతుందని తెలుస్తోంది.
ఇక పరీక్ష తేదీకి 10 రోజులకు ముందుగా కేంద్రాల వివరాలను వెల్లడిస్తారు. అంటే శని లేదా ఆదివారాల్లో ఆ వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. కాగా ఈ పరీక్షకు గాను రైళ్లలో ఉచితంగా ప్రయాణించేందుకు ఆప్షన్ ఎంచుకున్న ఎస్‌సీ, ఎస్టీ కేటగిరిలకు చెందిన విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తారు. ఈ క్రమంలో అభ్యర్థులు కేవలం అధికారిక ఆర్ఆర్‌బీ వెబ్సైట్లను మాత్రమే సందర్శించాల్సి ఉంటుందని తెలిపారు. ఇతర ఏ వెబ్‌సైట్‌లో వచ్చే సమాచారాన్ని, వార్తలను నమ్మకూడదని తెలిపారు.
పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ రైల్వే ఎన్‌టీపీసీ అడ్మిట్ కార్డుతోపాటు ఏదైనా ఫొటో ఐడీ కార్డును చూపించాల్సి ఉంటుంది. ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, ఇ-ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్ పోర్టు, ప్రభుత్వ ఉద్యోగి అయితే ఐడీ కార్డు, యూనివర్సిటీ, కాలేజీ ఇచ్చిన ఐడీ కార్డులలో దేన్నయినా ఐడీ ప్రూఫ్ కింద ఎగ్జామ్ సెంటర్ వద్ద చూపించి పరీక్ష రాసేందుకు వెళ్లవచ్చు.
అభ్యర్థులు ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ కాల్ లెటర్‌ను రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ సహాయంతో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్లలో సదరు లెటర్లు అందుబాటులోకి వచ్చినప్పుడు వాటిని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సరైన సమాచారం కోసం కేవలం ఆర్ఆర్‌బీ వెబ్సైట్లను మాత్రమే సందర్శించాలని, ఇతర సైట్లలో తప్పుడు సమాచారం చూసి నష్టపోవద్దని అధికారులు హెచ్చరించారు.