మాజీ మంత్రి వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై న్యాయస్థానం స్టే విధించిందని, గతంలో తెలంగాణ హైకోర్టు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేస్తూ జూలై ఒకటవ తేదీన లక్ష రూపాయల పూచికత్తుతో తిరిగి బెయిలును మంజూరు చేసిన విషయం తెలిసిందేనని వైసీపీ ఎంపి రఘురామ అన్నారు. బెయిల్ రద్దు చేసి, తిరిగి బెయిల్ మంజూరు చేయడం వెకిలిగా ఉందన్న వాదనలతో ఏకీభవిస్తూ న్యాయస్థానం స్టే విధించిందని అన్నారు.
అవినాష్ రెడ్డి తల్లి గారి ఆరోగ్యం మెరుగుపడి హైదరాబాదులోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారని, కడప, కర్నూలు కేంద్రంగా నడిచిన డ్రామాలు హైదరాబాదులోని ప్రముఖ ఆసుపత్రి ఆవరణలో నడిచే అవకాశాలు లేవని అన్నారు. కే ఏ పాల్ గారు ఆశీర్వదించిన వెంటనే శ్రీలక్ష్మికి ఆరోగ్యం కుదుటపడినట్లు సాక్షి దినపత్రికలో రాశారని, కేఏ పాల్ ఆశీస్సులు జగన్ మోహన్ రెడ్డి గారికి మెండుగా ఉండాలని, ఇక బ్రదర్ అనిల్ గారు జగన్ మోహన్ రెడ్డి గారి తరపున ప్రచారం, ప్రార్థనలు చేసే అవకాశాలు లేవని, కె ఏ పాల్ గారు ఆయన స్వస్థత కోసం ప్రార్థనలు చేయాలని రఘురామకృష్ణ రాజు గారు ఎద్దేవా చేశారు.