ఏపీ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కీలక కేటాయింపులు చేసింది. అంతేకాకుండా రైతులకు శుభవార్త చెప్పింది. ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ (రైతు భరోసా) పథకం అమలుపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి రైతులకు ఏడాదికి రూ.20వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామన్నారు.
పథకం విధివిధానాలు, మార్గదర్శకాలపై త్వరలోనే ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.4,500 కోట్లు ప్రతిపాదించినట్లు వెల్లడించారు. బడ్జెట్‌లో కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగం, రైతులకు మేలు చేసేలా కేటాయింపులు చేయడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.