తెలంగాణ వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి ఆలయాలకు పోటెత్తిన భక్తులతో రద్దీ కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రముఖ శైవక్షేత్రం శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
ఉదయం రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు, తితిదే అధికారులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించే సమయంలో సాధారణ భక్తుల దర్శనాన్ని నిలిపివేశారు. అప్పటికే గంటలకొద్ది లైన్లలో వేచి ఉన్న భక్తులు మరింత సమయం వేచి చూడటం వల్ల ఆగ్రహానికి గురయ్యారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి దర్శనం కోసం లోపలికి వెళ్లిన భక్తులకు ఉదయం 11గంటలైనా దర్శనం కాకపోవటంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
పలువురు పోలీసు అధికారుల కుటుంబ సభ్యులకు ముందుగా దర్శనం కల్పించడంతో భక్తులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవో డౌన్ డౌన్ అంటూ ఆందోళనకు దిగారు. అనంతరం అధికారులు క్యూలో ఉన్న భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించారు. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండడంతో చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడ్డారు.