రష్యా- ఉక్రెయిన్ మధ్య 12 వరోజు కూడా యుద్ధం భీకరంగా సాగుతోంది. ఈ క్రమంలో మరోసారి మూడో విడత చర్చల కోసం రెండు దేశాలు సమాయత్తం అవుతున్నాయి. ఈ చర్చలను ప్రపంచం చాలా ఆసక్తిగా చూస్తోంది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీతో నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్ లో మాట్లాడనున్నట్లు భారత ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి.
యుద్ధం మొదలైన తర్వాత జెలన్ స్కీ యుద్ధానికి ముగింపు పలికేలా… ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ట్విట్ కూడా చేశారు. ఇక ఆ దేశ విదేశాంగ మంత్రి కుబేలా కూడా ప్రధాని మోదీ చొరవ చూపాలని కోరారు. ఇండియా, రష్యా మధ్య మంచి స్నేహ సంబంధం ఉన్న కారణంగా ప్రధాని మోదీ చొరవ చూపి యుద్ధం ఆగేలా చేయాలని కోరారు. మరోవైపు భారత్ లో ఉన్న ఉక్రెయిన్ రాయబారి డాక్టర్ ఇగోరో పొలికా కూడా ప్రధాని మోదీని అభ్యర్థించారు. ఈక్రమంలో ఉక్రెయన్ అధ్యక్షుడితో మోదీ ఫోన్ లో మాట్లాడబోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇదిలా ఉంటే ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులను స్వదేశానికి తరలించడంలో ఉక్రెయిన్ పాత్ర మరవలేనిది. ఉక్రెయిన్ విదేశాంగ శాఖ భారత దేశ అభ్యర్థతనలను మన్నించి విద్యార్థుల తరలింపుకు సహకరించింది. ఈ విషయంలో ప్రధాని మోదీ.. అధ్యక్షుడు జెలన్ స్కీకి ధన్యవాదాలు తెలిపే అవకాశం కూడా ఉంది.