సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కి కొత్త టెన్షన్

-

నాగార్జున సాగర్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఎన్నిక జరుగుతుంది టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో ప్రత్యేక దృష్టి పెట్టింది గులాబీ పార్టీ అధిష్టానం. ఇప్పటికే నియోజకవర్గం నలు చెరుగులా నాయకులను మొహరించి ఎన్నికల రణతంత్రం రచిస్తుంది. ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న ఈ సమయంలో టీఆర్ఎస్ ని సింబల్ సమస్య వెంటాడుతుంది. సమస్య పాతదే అయిన కారు గుర్తును పోలిన కొన్ని ఎన్నికల గుర్తులు పార్టీ నేతలను టెన్షన్ పెడుతున్నాయి.


గతంలో జరిగిన ఎన్నికల్లో సైతం కారును పోలిన గుర్తులు ఉండటం టీఆర్ఎస్ పార్టీని దెబ్బతీశాయి. 2018 అసెంబ్లీ ఎన్నికలు మొదలు పార్లమెంట్ ఆ తర్వాత జరిగిన దుబ్బాక ఎన్నికల్లో సైతం కారును పోలిన సింబల్ కేటాయించడం టీఆర్ఎస్ ని గట్టిగానే దెబ్బతీసింది. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానారెడ్డి బరిలో ఉండటంతో ఎన్నికల్లో పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్న టీఆర్ఎస్ ని ఈ సింబల్ సమస్య మరింత టెన్షన్ పెడుతుంది. పార్టీ ప్రచారంతో పాటు డమ్మీ ఈవీఎంతో గుర్తును సైతం ప్రచారం చేసుకోవల్సి వస్తుంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కారును పోలి ఉన్న గుర్తులతో చాలాచోట్ల పార్టీ అభ్యర్దులు నష్టాపోయారంటుంది టీఆర్ఎస్. నకిరేకల్,పాలేరు,కామారెడ్డి,సంగారెడ్డి,జుక్కల్ ఇలా చోట్ల ట్రక్కు గుర్తు సింబల్ టీఆర్ఎస్ అభ్యర్ధులను దెబ్బతీసింది. కొన్ని చోట్ల మెజార్టీలు సైతం తగ్గిపోయాయి. పార్లమెంట్ ఎన్నికల్లో సైతం భువనగిరి పార్లమెంట్ పరిధిలో ట్రక్కు గుర్తు 27 వేలకు పైగా ఓట్లు చీల్చడంతో 4వేల ఓట్లలో కొమటిరెడ్డి కాంగ్రెస్ ఎంపీగా విజయం సాధించారు. తాజాగా దుబ్బాక ఎన్నికల్లో సైతం కారుని పోలిన రోటి మేకర్ గుర్తుతో 3 వేల ఓట్లు నష్టపోయిన టీఆర్ఎస్ రెండు వేల ఓట్ల స్వల్పతేడాతో ఓటమి పాలైంది.

ఆటో, ట్రక్కు లాంటి గుర్తులు బ్లాక్ అండ్ వైట్ లో ఉండటం ఓటర్లను గందరగోళానికి గురిచేస్తున్నాయి. కారు గుర్తు పోలి ఉండటంతో పాటు వృద్ధులు, నిరక్షరాస్యులు కొంత తికమకగు గురవుతున్నారు. దీనిపై ఈసీకి సైతం ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ ట్రక్కు గుర్తు లేకుండా చూసుకుంది. అయితే మళ్లీ ఇండిపెండెంట్ అభ్యర్థులకు అచ్చం కారును పోలి ఉన్న చపాతీ రోలర్, రోడ్డు రోలర్ గుర్తులు కేటాయించడంతో సమస్య మొదటికొచ్చింది. ఇప్పుడు సాగర్ లో సైతం ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్ధులకు చపాతీ రోలర్, రోడ్డు రోలర్ గుర్తులొచ్చాయి. అసలే పోటాపోటిగా జరుగుతున్న ఎన్నికలు కావడంతో గుర్తు సమస్య టీఆర్ఎస్ ని మరింత టెన్షన్ పెడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version