ఇప్పటి వరకు ఎలా ఉన్నారో.. ఏం చేశారో.. నాకు తెలియదు.. ఇకపై మాత్రం యాక్టివ్‌గా లేకపోతే.. వాతలే!! ఇదీ. తాజాగా వైసీపీ అధినేత, సీఎం జగన్ మీడియా సలహాదారు, వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి చీఫ్ విప్‌లు, ప్రభుత్వ విప్‌లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు. అంతేకాదు, రాష్ట్రంలో అధికార ప్రతినిధులుగా నియమితులైన 30 మందిని ఉద్దేశించి కూడా ఆయన చేసిన హెచ్చరిక ఇది..! మరి ఇంతకీ ఏంజరిగింది? ఎందుకు ఇలా అన్నారు? అసలు ఏం జరిగింది? అనే చర్చ జోరుగా సాగుతోంది. విషయంలోకి వెళ్తే.. గత కొన్నాళ్లుగా రాష్ట్ర సర్కారుపై విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. అయిన కాడికి, కాని కాడికి కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.
గత ప్రభుత్వం అమలు చేసిన రైతు రుణ మాఫీ 4, 5 విడతలను ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాలనే అసంబద్ధ డిమాండ్లతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇక, ఇసుక విషయంలోనూ ప్రతిపక్షాలు వాస్తవ పరిస్థితిని గమనించకుండానే విమర్శలు ఎక్కుపెట్టాయి. వీటికి తోడు రెండు మూడు వారాలుగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కూడా జగన్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు.
కేవలం పసికూన వంటి ప్రభుత్వంపై ఇంతలా విరుచుకుపడుతున్న ఈ విపక్ష నాయకులపై ప్రతి విమర్శ చేసేందుకు ఇప్పటి వరకు బలమైన వైసీపీ గళం ఒక్కటంటే ఒక్కటి కూడా మైకు ముందుకు రాకపోవడం గమనార్హం. నిజానికి టీడీపీలో కన్నా.. జనసేనలోకన్నా.. కూడా వైసీపీలోనే ఫైర్ బ్రాండ్లు ఎక్కువగా ఉన్నారు. ఎన్నికలకు ముందు, ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ వీరు విరుచుకుపడ్డారు. కానీ, ఇప్పుడు తమకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదనే చింతతో మౌనం వహిస్తున్నారు.
దీనిపై దృష్టి పెట్టిన జగన్ ఇటీవల జరిగిన అంతర్గత సమావేశంలోఇలాంటి వారి జాబితాను సిద్ధం చేసుకున్నారు. ఇకపై పార్టీ అధికార ప్రతినిధులు, విప్‌లు. ఫైర్ బ్రాండ్లు అందరూ కూడా ప్రభుత్వంపైనా, పార్టీ అధినేతపైనా, పార్టీపైనా వచ్చే విమర్శలకు కౌంటర్లు ఇవ్వాల్సిందేనని, ఏ జిల్లాలో వారు ఆ జిల్లాలకు బాధ్యులుగా కూడా ఉండాలని సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా హెచ్చరికలు పంపారని తెలుస్తోంది. దీంతో ఇకపై వైసీపీలో నేతలు, ఎమ్మెల్యేల దూకుడు పెరగడం ఖాయమని తెలుస్తోంది. మరి వీరి ధాటికి టీడీపీ, జనసేనలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.