ఆర్టీసీ సమ్మెపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం ఆర్టీసీ సమ్మె, ప్రభుత్వ తీరుపై మరోసారి హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వానికి అధికారం ఉన్నట్లే కోర్టులకు కూడా అధికారాలు ఉంటాయనే సంగతి మర్చిపోవద్దని హైకోర్టు తీవ్రంగా స్పందించింది. లెక్కలు సమర్పించడంలో అధికారులు అతితెలివి ప్రదర్శిస్తున్నారని మండిపడ్డ కోర్టు, ఉన్నతాధికారులపై కోర్టుధిక్కరణ కేసు కూడ పెట్టగలమని హెచ్చరించింది. కార్మికుల డిమాండ్లను మరోసారి పరిశీలించి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి ఆదేశించింది.
మరోవైపు ఆర్టీసీ విభజన ఇంకా పూర్తి కానందున టీఎస్‌ఆర్టీసీ అనేదే మనుగడలో లేదని కేంద్రం తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ హైకోర్టుకు విన్నవించారు. టిఎస్‌ఆర్టీసీకి ఎలాంటి చట్టబద్ధత లేదని, తమకు 33శాతం వాటా ఉన్నది ఏపీఎస్‌ఆర్టీసీలోనని ఆయన కోర్టుకు స్పష్టం చేసారు. అలాగే రాష్ట్రప్రభుత్వం నుండి ఆర్టీసీపై తమకు ఎలాంటి అభ్యర్థన అందలేదని కూడా కేంద్రం తెలిపింది.
ఈనెల 11వ తేదీలోపు కార్మికులతో చర్చలు జరిపి..సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని న్యాయస్థానం సూచించింది. 11వ తేదీలోపల సమస్య పరిష్కరించక పోతే…తామే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు పరోక్షంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ.. తదుపరి విచారణ ఈనెల 11కు వాయిదా వేసింది. సెప్టెంబర్ నెల జీతాలపై ఇంకో కేసు మరికాసేట్లో విచారణకు రానుంది. మరోవైపు ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు స్వీకరించింది. శుక్రవారం (రేపు) దానిపై విచారణ జరపనుంది.
కేంద్రం ప్రకటనతో విచిత్ర పరిస్థితి నెలకొంది. టిఎస్‌ఆర్టీసీకి చట్టబద్ధత లేదంటున్న కేంద్రం వైఖరితో ఇప్పుడు అసలేం జరుగుతోందో అర్థంకావడంలేదు. రాష్ట్రప్రభుత్వం ఈ ప్రకటనతో సందిగ్ధంలో పడింది. అలాగే కార్మికుల సమ్మె కూడా అయోమయంలో పడింది. ఇది ఎందాక వెళుతుందో ఎవరికీ అంతుపట్టడంలేదు.