కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. ఇండియా కూటమి దుమ్ము తుడిచిపెట్టుకుపోయిందని అన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కూడా దాటదు, సమాజ్‌వాదీ పార్టీకి నాలుగు సీట్లు కూడా రావని అన్నారు .ఉత్తర ప్రదేశ్లోని బల్లియాలో జరిగిన సమావేశంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 5 దశల్లో మోడీ 310 సంఖ్యను అధిగమించారని..ఆరో దశలో 400 దాటిందని పేర్కొన్నారు.
అనంతరం.. సేలంపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. ఈ ఎన్నికలు రామభక్తులపై కాల్పులు జరిపిన వారికి, రామమందిరం కట్టిన వారికి మధ్య జరిగే ఎన్నికలని ఆయన అన్నారు.ఉత్తరప్రదేశ్‌లో అవినీతిలో కూరుకుపోయిన ఎస్పీ, యూపీఏ ప్రభుత్వాలు రూ.12 లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డాయని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మరోవైపు 25 ఏళ్లు రాజ్యాంగ పదవిలో ఉన్నప్పటికీ 25 పైసల అవినీతి ఆరోపణలు లేని వ్యక్తిగా మోడీ నిలిచారని ప్రశంసల జల్లు కురిపించారు.