సండే స్పెషల్: ఎంతో రుచికరమైన నాటుకోడి పులుసు ఎలా చేయాలో తెలుసా.. !!

-

మాంసాహారులలో నాటుకోడి పులుసును ఇష్టపడని వారుండరు. మిగిలిన సీజన్లలో కంటే ఈ వర్షాకాలంలో దీన్ని రుచిచూడటం మరింత బాగుంటుంది. ముఖ్యంగా రాగిముద్ద లేదా ఏదన్నా పులావ్ తో కలిపి తిన్నప్పుడు దీని రుచిని మాటల్లో వర్ణించలేము. మరి.. నాటుకోడిపులుసు చేసుకోవడం ఎలాగో తెలుసుకొందాం.పల్లెటూళ్లలో బాగా పెంచుతారు నాటు కోళ్ళని.. మాములు కోడి కన్నా ఈ నాటుకోడి ఇంకా రుచికరంగా ఉంటుంది.
                 

 

కావలసినవి :

నాటుకోడి మాంసం 1 కేజీ

ఉల్లిపాయలు 3 పెద్దవి

అల్లం వెల్లుల్లి ముద్ద 3 చెంచాలు

పసుపు – అర చెంచా

నిమ్మరసం – 3 చెంచాలు

పెరుగు – పావు కప్పు

ఎండుకొబ్బరిముక్కలు – 3 చెంచాలు

పచ్చి మిరపకాయలు – 2

గసగసాలు – ఒక గుప్పెడు

ధనియాలపొడి – 2 చెంచాలు

జీలకర్ర పొడి – 1 చెంచా

గరం మసాలాపొడి – 2 చెంచాలు

దాల్చిన చెక్క – 2 అంగుళాల ముక్క

లవంగాలు – 4

యాలుకలు – 2

ఆనాస పూలు – 2

సాజీరా అరచెంచా  

మరాఠీ మొగ్గలు – 2

బిర్యానీ ఆకులు 2

జాపత్రి – ఒక రెమ్మ

కొత్తిమీర తరుగు – పావుకప్పు

పుదీన ఆకులు – గుప్పెడు

నూనె – 3 గరిటెలు  

ఉప్పు, కారం – రుచికి సరిపడ

 తయారీ విధానం :

ముందుగా నాటుకోడి మాంసాన్ని బాగా కడిగి నీళ్ళు పూర్తిగా ఒంపి అందులో కొద్దిగా ఉప్పు, కారం, ఒక చెంచా అల్లం వెల్లుల్లి ముద్ద, పెరుగు, కొంచం పసుపు, నిమ్మరసం వేసి కలిపి గిన్నె మూతపెట్టి అరగంట పాటు పక్కన పెట్టాలి.ఇప్పుడు పొయ్యిమీద కుక్కర్ పెట్టి ఒక గరిటెడు నూనె వేసి కాగాక అందులో కలిపి పెట్టుకొన్న చికెన్ వేసి 5 నిమిషాలు కాసేపు ఎక్కువ సెగమీద ఉంచి కొంచం నీళ్ళు పోసి మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేవరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
ఈ లోపు ఉల్లిపాయలను ముద్దలా చేసుకోవాలి. ఎండుకొబ్బరిని, గసగసాలను కలిపి మెత్తగా ముద్దలా చేసుకోవాలి.ఇప్పుడు పొయ్యిమీద కడాయి పెట్టి మిగిలిన నూనె వేసి కాగాక అందులో దాల్చిన చెక్క, లవంగాలు, సాజీర, అనాసపూలు, మరాఠీమొగ్గలు, బిర్యానీ ఆకులు, జాపత్రి, యాలుకలు వేసి వేయించుకోవాలి. అవి వేగాక అందులో ఉల్లిముద్దను వేసి దోరగా వేయించాలి.
ఉల్లిముద్ద సగానికి పైగా వేగాక అందులో పసుపు, నిలువునా చీల్చిన పచ్చిమిర్చి, కొంచం పుదీనా, కొంచం కొత్తిమీర వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముద్ద బాగా వేగి ఎర్రగా వచ్చాక.. అల్లం వెల్లుల్లి ముద్దను వేసి కలిపి వేయించుకోవాలి.అది కూడా వేగాక అందులో నూరుకొన్న ఎండుకొబ్బరి, గసగసాల ముద్దను వేసి వేయించుకోవాలి.
ఈ మిశ్రమం బాగా వేగి నూనె బయటకు వచ్చేటప్పుడు అందులో రుచికిసరిపడ ఉప్పు, కారం, ధనియాలపొడి, జీర పొడి వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో అర కప్పు నీళ్ళు పోసి గ్రేవీ వచ్చేలా ఉడికించాలి.
గ్రేవీ ఉడుకుపట్టాక అందులో కుక్కర్లో ఉడికించిన మాంసం అలాగే వేసి కలిపి మిగిలిన కొత్తిమీర, పుదీనా వేసి రుచి సరిచూసుకుని మూత పెట్టి ఒక పదినిమిషాలు ఉడికించాలి.కూర ఉడికిన తర్వాత చివరగా గరం మసాలా పొడి, కొంచెం కొత్తిమీర వేసి కలిపి మరలా ఒక 2నిమిషాలు ఉడికించుకొని దించితే ఘుమఘుమలాడే నాటుకోడి పులుసు రెడీ అయినట్లే.

Read more RELATED
Recommended to you

Exit mobile version