తెలంగాణలో ‘యాత్ర’ల పర్వం.. కిషన్‌రెడ్డి కంటే సంజయ్ యాత్రకే బీజేపీ ప్రాముఖ్యత..!

-

తెలంగాణలో యాత్రల పర్వం నడుస్తోంది. ఇటీవల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ‘జన ఆశీర్వాద యాత్ర’ చేశారు. తాజాగా తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్ కుమార్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ షురూ చేశారు. త్వరలో జర్నలిస్టు తీన్మార్ మల్లన్న పాద‌యాత్ర చేయబోతున్నట్లు ప్రకటనలు వచ్చాయి. అయితే, ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ‘దళిత, గిరిజన దండోరా సభ’లు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాజకీయం బాగా వేడెక్కుతోంది. బీజేపీ బాగా దూకుడుగా వ్యవహరించేందుకుగాను సిద్ధమవుతోంది.

అధికార టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ అధికారమే లక్ష్యంగా బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి సంజయ్ కుమార్ పాదయాత్ర స్టార్ట్ చేశారు. ఇందుకుగాను భారీ ఏర్పాట్లు చేయగా, పార్టీ ప్రముఖులందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణ బీజేపీ రాష్ట్రవ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్రస్థాయి నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు భారీగా వచ్చారు. వారందరూ వచ్చి సంజయ్ యాత్రకు సంఘీభావం తెలిపారు.

కాగా, సంజయ్ యాత్ర ప్రారంభానికి వచ్చినంత మంది కిషన్‌రెడ్డి యాత్రకు రాలేదనే చర్చ నడుస్తున్నది. మొత్తంగా కిషన్‌రెడ్డి కంటే కూడా బండి సంజయ్‌కే బీజేపీలో ఇమేజ్ ఉందనే టాక్ వినబడుతున్నది. ఇకపోతే కిషన్‌రెడ్డి సైతం సంజయ్ కుమార్‌కు సంపూర్ణ మద్దతు తెలపడం ద్వారా సంజయ్‌దే పై చేయిగా ఉండబోతున్నదని తెలుస్తోంది. కాగా, పాదయాత్ర సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసేందుకుగాను కమలనాథులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బీజేపీ శ్రేణులు కూడా నూతనోత్తేజంతో ‘ప్రజా సంగ్రామ యాత్ర’లో పాల్గొనేందుకు సంసిద్ధమవుతున్నాయి. సంజయ్ పాదయాత్రకు ఎటువంటి రెస్పాన్స్ ఉండబోతున్నదనేది త్వరలో తేలనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version