సావిత్రి బాయి పూలే 194వ జయంతి (జనవరి 3) సందర్భంగా బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ.. సావిత్రిబాయి పూలే దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని, మహిళల విద్యకోసం ఆమె ఎంతగానో శ్రమించిందని పేర్కొన్నారు.
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, వారి చదువు, మెరుగైన జీవితాన్ని అందించేందుకు పూలే దంపతులు ఎంతో కృషి చేశారన్నారు.ఈ నేపథ్యంలోనే జనవరి 3వ తేదీ సావిత్రి బాయి జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించిందని గుర్తుచేశారు. ఇకపై ప్రతిఏటా సావిత్రి బాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.సావిత్రి భాయ్ పులే మార్గదర్శకత్వంలో ప్రపంచంలో అన్ని రంగాల్లో మహిళలు పోటీ పడి, ఎదగాలని కోరుకున్నారు.