వైఎస్సార్ సీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ మళ్లీ దూకుడు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయనపై మరోసారి న్యాయపరంగా మొట్టికాయలు వేయించేందుకు టీడీపీ సహా మిగిలిన పక్షాలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే సెప్టెంబరు ఐదు నుంచి రాష్ట్రంలో పాఠశాలలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. వాస్తవానికి ఈ ఏడాది విద్యాసంవత్సరాన్ని కరోనా నేపథ్యంలో తమిళనాడు, తెలంగాణ, ఒడిసా వంటి పక్క రాష్ట్రాలు రద్దు చేసుకున్నాయి. బతికుంటే బలుసాకు ఏరుకోవచ్చు- అన్నచందంగా ఆయా రాష్ట్రాలు విద్యాసంవత్సరాన్ని రద్దు చేసి.. విద్యార్థులు కరోనా భారిన పడకుండా చర్యలు తీసుకున్నాయి.
అయితే, దీనికి భిన్నంగా జగన్ ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కోరలు చాచింది. ఆదిలో జగన్ చెప్పినట్టు జూలై రెండో వారానికి రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పడతాయని అందరూ అనుకున్నారు.కానీ, కేసులు కోకొల్లలుగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా తన అధీనంలోని చాలా విద్యాసంస్థలకు ఎడ్యుకేషన్ హాలీడే ప్రకటించింది. కానీ, రాష్ట్రంలో మాత్రం జగన్ విద్యాసంస్థలను తెరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. మొదట్లో ఆగస్టు లోనే స్కూళ్లను తెరవాలని నిర్ణయించుకున్నారు.
కానీ, కేసుల తీవ్రత, మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతుండడంతో దీనిని వాయిదా వేశారు. ఇక, ఇప్పుడు సెప్టెంబరు 5వ తారీకు గురుపూజా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎట్టిపరిస్థితిలోనూ పాఠశాలలు తెరిచి తీరాలని నిర్ణయించుకోవడం వివాదానికి దారితీస్తోంది. ఆయన వైఖరిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో కరోనా తీవ్రంగా ఉంది. చిన్నపిల్లలను స్కూళ్లకు రప్పిస్తే.. వారి జీవితాలు ఏమవుతాయనే వాదన వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో జగన్ స్కూళ్లు తెరిచే కార్యక్రమాన్ని వాయిదా వేసుకోకపోతే.. కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. తాజాగా రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య వెయ్యి మందికి చేరిన నేపథ్యంలో జగన్ చుట్టూ మరిన్ని విమర్శలు ముసురుకునే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఆయన ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.