కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఏపీ, తెలంగాణలో స్కూల్లు ప్రారంభించేందుకు విద్యాశాఖ సిద్ధమైన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఆగస్టు 15 నుండి పాఠశాలలు ప్రారంభం కాగా ఏపీలో ఈరోజు నుండి పాఠశాలలను ప్రారంభిస్తున్నారు. అయితే ఇప్పటికీ కేసులు స్వల్పంగా నమోదవుతున్న నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బడికి వచ్చే విద్యార్థుల ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉన్నా లేదంటే విద్యార్థులకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా వారు పాఠశాలకు రాదని స్పష్టం చేసింది.
విద్యార్థులు, వృద్ధుల ఆరోగ్యం గురించి ఆలోచించి విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పాఠశాలకు వస్తున్న విద్యార్థులకు కరోనా లక్షణాలు ఉన్నట్లయితే వారికి వెంటనే పరీక్షలు చేయాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఆ విద్యార్థులతో కూర్చున్న తరగతిలోని విద్యార్థులందరికీ టెస్టులు చేయాలని నిర్ణయించింది. అయితే విద్యార్థులు స్కూల్ కు వెళ్లాలంటే తల్లిదండ్రుల లిఖిత పూర్వకమైన అనుమతి కూడా తప్పనిసరని విద్యా శాఖ స్పష్టం చేసింది. కొంతమంది విద్యార్థులను ఇప్పుడే స్కూల్ కు పంపడం తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవచ్చు. ఈ నేపథ్యంలోనే విద్యా శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.