ఎప్పుడైనా మీ స్నేహితులతో ఆకాశంలోకి చూసి “అసలు ఆ సూర్యుడు అంత వేడిగా ఎందుకు ఉంటాడు? అని ఆలోచించారా? మనం రోజు చూసే ఆ నక్షత్రం కేవలం వేడిని, వెలుగును మాత్రమే ఇవ్వడం లేదు. అది అంతుచిక్కని అయస్కాంత రహస్యాలు, ఊహకు అందని సౌర తుఫానులను తనలో దాచుకుంది. ఈ మిస్టరీలను ఛేదించడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులు ఒక కొత్త యుద్ధాన్ని మొదలుపెట్టారు. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో మన ఇస్రో ప్రయోగించిన ఆదిత్య-L1 మిషన్ దగ్గర నుంచి, నాసా పంపిన పార్కర్ సోలార్ ప్రోబ్ వరకు.. ప్రతి పరిశోధన వెనుక మానవాళి భవిష్యత్తును మార్చగల ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. మరి వాటి గురించి తెలుసుకుందాం..
అంతుచిక్కని అతిపెద్ద రహస్యం: సూర్యుడిపై శాస్త్రవేత్తలను దశాబ్దాలుగా వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న ఒకటి ఉంది: అదే ‘కరోనా తాపన సమస్య’ సూర్యుని ఉపరితలం దాదాపు 6,000∘C వేడి ఉంటే దాని వెలుపల ఉండే వాతావరణం (కరోనా) మాత్రం కొన్ని లక్షల డిగ్రీలుగా ఉంటుంది. అంటే మంటకు దగ్గరగా ఉన్న దానికంటే దూరంగా ఉన్న ప్రాంతం ఎక్కువ వేడిగా ఉంది. ఇది సైన్స్ నియమాలకు విరుద్ధంగా ఉంది కదా? ఈ వింతకు కారణాన్ని కనుగొనడానికి, శాస్త్రవేత్తలు శక్తివంతమైన అయస్కాంత తరంగాలపై దృష్టి సారించారు. ఇవి కరోనాలోకి శక్తిని మోసుకెళ్తున్నాయని ఒక రకంగా కరోనాను ‘హీట్’ చేస్తున్నాయని వారు అంచనా వేస్తున్నారు.

సౌర తుఫానుల వెనుక ఉన్న పవర్ హౌస్: ఈ పరిశోధనలన్నీ కేవలం నక్షత్రాన్ని చూసి ఆశ్చర్యపోవడానికి కాదు, మన భూమిని రక్షించుకోవడానికి కూడా సూర్యుడి నుండి అప్పుడప్పుడు భారీగా ప్లాస్మా మరియు శక్తి విస్ఫోటనం చెందుతుంది. వీటినే సౌర తుఫానులు లేదా కరోనల్ మాస్ ఎజెక్షన్లు (CMEs) అంటారు. ఇవి అంతరిక్షంలో ప్రయాణించి మన భూమిని తాకితే, GPS వ్యవస్థలు, కమ్యూనికేషన్ శాటిలైట్లు, చివరికి పవర్ గ్రిడ్‌లు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే, ఆదిత్య-L1 వంటి ఉపగ్రహాలు సూర్యుడిని నిరంతరం గమనిస్తున్నాయి. దీని ముఖ్య లక్ష్యం, ఈ తుఫానులు ఏర్పడడానికి గల కారణాలను ముందుగానే గుర్తించి, వాటి గురించి మనకు ముందుస్తు హెచ్చరికలు ఇవ్వడం.
సూర్యుడు ఒక శాశ్వతమైన రహస్యం. కానీ ప్రతి కొత్త అధ్యయనంతో ప్రతి కొత్త మిషన్‌తో, మనం ఆ రహస్యాన్ని ఛేదించేందుకు ఒక్క అడుగు ముందుకు వేస్తున్నాము. మన దేశ శాస్త్రవేత్తలు పంపిని ఆదిత్య L1 ఈ అన్వేషణలో ముందుండి నడిపిస్తోంది. ఈ నక్షత్రం యొక్క శక్తి మరియు వింతలను అర్థం చేసుకోవడం అనేది కేవలం సైన్స్ విజయమే కాదు శక్తివంతమైన భవిష్యత్తు కోసం మనం వేస్తున్న అడుగు.