చంద్రబాబు చేసినట్లుగా తాను ఎమ్మెల్యేలని కొనుగోలు చేయనని, అన్యాయంగా లాక్కోను అని జగన్ ఎప్పుడు చెబుతూ ఉంటారు..అలాగే తమ పార్టీలోకి వచ్చేవారు ఎవరైనా సరే వారు తమ పదవులకు రాజీనామా చేసి రావాలనే రూల్ కూడా పెట్టారు. అయితే అధికారంలోకి వచ్చాక టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలని వైసీపీ వైపుకు తిప్పుకున్నారు. కానీ వారి చేత పదవులకు రాజీనామా చేయించలేదు. ఈ విషయంపై స్పీకర్ తమ్మినేని సీతారాంని అడిగితే..వారు ఇంకా టీడీపీ సభ్యులే అని చెబుతున్నారు.
అంటే వారు టీడీపీని వదిలారు గాని…డైరక్ట్ గా వైసీపీలో చేరలేదు…వైసీపీ కండువా కప్పుకోలేదు…అంటే అనధికారికంగా వైసీపీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు…అయితే ఆ పార్టీ సభలకు వెళుతున్నారు…కార్యక్రమాలు చేస్తున్నారు…ప్లీనరీలో పాల్గొన్నారు…వర్క్ షాప్ లో పాల్గొంటున్నారు. అయినా సరే వారి చేత రాజీనామాలు చేయించడం లేదు. ఇక నెక్స్ట్ ఎన్నికల వరకు నలుగురు జంపింగ్ ఎమ్మెల్యేలు అలాగే కొనసాగేలా ఉన్నారు.
ఇక ఇదే సమయంలో జంపింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో వైసీపీలో సీట్లు కూడా ఫిక్స్ అయిపోతున్నాయి. ఇప్పటికే గన్నవరంలో వైసీపీ నుంచి వల్లభనేని వంశీ పోటీ చేస్తారని కొడాలి నాని చెప్పిన విషయం తెలిసిందే. ఇక్కడ వైసీపీ సీటు కోసం దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావులు కూడా పోటీ పడుతున్నారు. కానీ సీటు మాత్రం వంశీదే అని కొడాలి నాని చెప్పేశారు.
ఇటు వస్తే గుంటూరు వెస్ట్ సీటు మద్దాలి గిరికే కేటాయిస్తారని తెలిసింది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ఆయన తర్వాత వైసీపీలోకి వచ్చారు. ఇక్కడ కూడా వైసీపీలో తీవ్రమైన పోటీ ఉంది…అయినా సరే గిరికే సీటు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అటు వస్తే విశాఖ సౌత్ సీటు వాసుపల్లి గణేశ్ కు ఫిక్స్ అయిందట. అయితే చీరాల సీటు విషయంలో క్లారిటీ రాలేదు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కరణం బలరాంకు సీటు ఇస్తారా? లేక మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు సీటు ఇస్తారో క్లారిటీ లేదు. మొత్తానికైతే వైసీపీలో జంపింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఫిక్స్ అయ్యాయి.