పెన్షన్ డబ్బులతో సచివాలయ లైన్మెన్ పరారైన ఘటన అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో జరిగింది. వెంకటేష్ లైన్మెన్ గా పనిచేస్తున్నాడు. ఈరోజు ఒకటవ తేదీ కావడంతో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దీంతో ప్రభుత్వం తెట్టు దళితవాడ పింఛన్ల పంపిణీ బాధ్యతలను లైన్మెన్ వెంకటేష్ కు అధికారులు అప్పగించారు. దాదాపు 80 మందికి పైగా లబ్ధిదారులకు పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యతను వెంకటేష్ కు అప్పగించారు.

రూ. 4.90 లక్షలతో వెంకటేష్ పరారీ అయ్యాడు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో గంగయ్య ముదివేడు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వివరాలు సేకరించిన పోలీసులు పరారీలో ఉన్న వెంకటేష్ ను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పింఛన్ దారులు లైన్మెన్ వెంకటేష్ పై ఫైర్ అవుతున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు ఏపీలో చాలానే జరిగాయి. దీంతో ఏపీ ప్రభుత్వం ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.