మావోయిస్టుల కంచుకోటగా పేరుగాంచిన కర్రెగుట్టలను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. గత కొంతకాలంగా ఇక్కడ మావోయిస్టుల కదలికలు అధికంగా ఉండటంతో భద్రతా బలగాలు వ్యూహాత్మకంగా ముందుకు కదిలాయి. తాజాగా దోబికొండ, నీలం సరాయ్ కొండలతో సహా కర్రెగుట్టల్లోని కీలక ప్రాంతాలను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. భారీ స్థాయిలో సాయుధ బలగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, 20 వేలకు పైగా భద్రతా సిబ్బంది కర్రెగుట్టలను చుట్టుముట్టి విస్తృతమైన సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. గుట్టల ప్రతి అంగుళాన్ని జల్లెడ పడుతూ మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు.
కర్రెగుట్టలను పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చుకున్న అనంతరం, ఇక్కడ ఒక శాశ్వతమైన బేస్ క్యాంప్‌ను ఏర్పాటు చేయడానికి భద్రతా బలగాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ బేస్ క్యాంప్ ఏర్పాటుతో ఈ ప్రాంతంలో భద్రతను మరింత పటిష్టం చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా, మావోయిస్టుల కదలికలను నిరంతరం పర్యవేక్షించడానికి, వారి కార్యకలాపాలను అడ్డుకోవడానికి ఇది సహాయపడుతుంది. కర్రెగుట్టలు దట్టమైన అటవీ ప్రాంతంతో కూడుకొని ఉండటం వల్ల మావోయిస్టులకు ఇది సురక్షితమైన స్థావరంగా ఉండేది. ఇక్కడి కొండలు, గుట్టలు వారికి ఆశ్రయం ఇవ్వడంతో పాటు, భద్రతా బలగాల కదలికలను గుర్తించడానికి అనువుగా ఉండేవి. అయితే, భద్రతా బలగాలు చేపట్టిన ఈ భారీ ఆపరేషన్ మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.