సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు(70) అనారోగ్యంతో ఈ రోజు మధ్యాహ్నం కన్నుమూశారు. యూరిన్ ఇన్ఫెక్షన్ కు గురైన ఆయన ఆస్పత్రిలో చేరి మరణించారు. దాదాపు 50 ఏళ్లుగా ఆయన పత్రికా రంగంలో సేవలందించారు. సినీనటుడు చిరంజీవికి ఆయన ఆప్తుడు. పసుపులేటి రామారావు పలు పుస్తకాలను కూడా రచించారు. విశాలాంధ్ర పత్రికతో జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన ఆ తర్వాత పలు పత్రికల్లో పనిచేశారు. సినిమాలకి పీఆర్ఓగా కూడా పనిచేశారు. అలాగే ఆయన స్వస్థలం ఏలూరు.
దాదాపు అందరూ అగ్ర హీరోలను ఆయన ఇంటర్వ్యూ చేశారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ‘రామారావు నా ఆత్మబంధువు… ఆ కుటుంబానికి అండగా ఉంటా’ అని మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయన కన్నుమూశారని వార్త తెలుసుకుని బాధపడ్డానంటూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. అలాగే అయన మరణం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు జర్నలిస్టులు కూడా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి సంస్థ నుంచి వెలువడే జ్యోతి చిత్ర సినిమా వారపత్రిక, శివరంజని, సంతోషం తదితర సినిమా పత్రికలలో పసుపులేటి పనిచేశారు.