అనంతపురం జిల్లా టీడీపీ రాజకీయాలు దుమారంగా మారాయి. ఇక్కడ సీనియర్ రాజకీయ నేతలుగా ఉన్నజేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్ రెడ్డి సోదరుల హవా కారణంగా నాయకులు పార్టీకి అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో జేసీ కుటుంబం నుంచి ఇద్దరు వారసులు రంగంలోకి దిగారు. అస్మిత్ రెడ్డి, పవన్ రెడ్డిలు పోటీ చేసి.. ఘోరంగా ఓడిపోయారు. అయినా కూడా ఈ ఫ్యామిలీ పార్టీపై ఆధిపత్యం చలాయించాలనే ధోరణిని మాత్రం విడిచి పెట్టడం లేదు. సరే.. పోనీ పార్టీ బాధ్యతలు అప్పగించాలని భావించినా.. వీరు స్థిరంగా పార్టీలోనే ఉంటారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
జేసీ సోదరులు ఇద్దరూ కూడా ఎన్నికల అనంతరం పక్క చూపులు చూపుస్తున్నారు. దీంతో పార్టీ పగ్గాలు అప్పగించినా వారు ఉంటారనే గ్యారెంటీ లేదు. పైగా జిల్లాలో పార్టీని నడిపించడంలో ఏమైనా కీలక పాత్ర పోషిస్తున్నారా? అంటే.. అదీలేదు. తాము తప్ప మిగిలిన వారంతా డమ్మీలే అనే ధోరణినే ఇద్దరు సోదరులు ప్రదర్శిస్తున్నారు. దీంతో పార్టీలో కీలకంగా ఉన్న నాయకులు కూడా వీరి వైఖరితో దూరంగా ఉంటున్నారు. ప్రభాకర్‌రెడ్డి గత ఐదేళ్లకాలంలో ప్రాతినిధ్యం వహించిన తాడిపత్రిలో కేడర్ వెళ్లిపోయింది.
ఇటీవలే ఇక్కడి కేడర్ వైసీపీలో చేరిపోయింది. పైగా ఇక్కడ ప్రభాకర్‌రెడ్డిని పట్టించుకునేవారు కూడా కరువయ్యారు. ధర్మవరంలో వరదాపురం సూరి ఎన్నికలు ముగిసిన రెండో నెలలోనే వెళ్లిపోయారు. ఆయన నేరుగా వెళ్లి బీజేపీ తీర్థం పుచ్చుకు న్నారు. ఇక, పీఏసీ చైర్మన్‌గా ఉన్న పయ్యావుల కేశవ్ కూడా తనకెందుకులే అన్నట్టుగా పార్టీ విషయంలో అంటీముట్టనట్టే ఉన్నారు. అనంతపురం అర్బన్‌లో గత ఎన్నికల్లో విజయం సాధించిన ప్రభాకర చౌదరికి జేసీ బ్రదర్స్‌కు మధ్య ఒకే పార్టీలో ఉన్నా.. ఉప్పు-నిప్పుగా నే ఉంది.
గతంలో చంద్రబాబు అనేక సార్లు పంచాయతీలు నిర్వహించినా వీరి మద్య సయోధ్య లేదు. ఇక, కళ్యాణదుర్గంలో ఉన్నం హనుమంతరాయ చౌదరికి జేసీ వర్గానికి పడదు. దీంతో ఇక్కడ కూడా పార్టీని పట్టించుకునేవారు లేకుండా పోయారు. గుంతకల్లులోనూ ఇదే పరిస్థితి. మరో కీలక నియోజకవర్గం శింగనమలలోనూ టీడీపీ సీనియర్ నాయకురాలు..ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కూతురు మాజీ విప్ యామినీ బాల కూడా జేసీ వర్గంతో విభేదించి దూరంగానే ఉంటున్నారు.
ఇలా జిల్లా మొత్తంగా జేసీ వర్గానికి ఎక్కడా పాజిటివ్ కోణమే కనిపించడం లేదు. పైగా ఇటీవల ఎన్నికల్లో ఓటమి పాలైన యువ నాయకులు, జేసీ వారసులు ఇప్పటి వరకు మళ్లీ పార్టీ గురించి పట్టించుకున్నదీ, ఓటమిపై విశ్లేషించుకున్నదీ లేదు. పైగా అస్మిత్ ఏకంగా తనకు రాజకీయాలు సరిపడవంటూ ఇటీవల వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఇలా మొత్తంగా జేసీ బ్రదర్స్ వ్యవహారంతో అనంత టీడీపీలో దుమారం రేగుతూనే ఉండడం గమనార్హం.