అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం తుఫాన్‌తో అతలాకుతలమైంది. తీవ్రమైన గాలులు వీయడంతో.. ఆ రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సుమారు ఆరు లక్షల మంది కస్టమర్లకు కరెంటు అంతరాయం ఏర్పడింది. హురికేన్ సమయంలో వీచే బలమైన గాలులు వీచాయి. గంటకు సుమారు 123 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. టెక్సాస్ తో పాటు మరో అయిదు రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి విపరీత వాతావరణ పరిస్థితుల వల్ల 24 మంది మరణించారు. దక్షిణ టెక్సాస్‌లో వేడి వల్ల తీవ్ర ఉక్కపోత ఉంటోంది. భారీ తుఫాన్ వల్ల వేలాది ఇండ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
టెక్సాస్‌లో టోర్నడో సైరెన్లు మోగాయి. డల్లాస్‌తో పాటు సమీప ప్రాంతాలకు వార్నింగ్ సంకేతాలను జారీ చేశారు. ఇండ్ల మధ్యకు నీరు చేరడం, పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడం, విద్యుత్తు లైన్లు తెగిపోవడం లాంటి ఘటనలు నమోదు అయ్యాయి. డల్లాస్‌లో దాదాపు లక్ష మంది కస్టమర్లకు విద్యుత్తు సరఫరా లేదు. గత కొద్ది రోజుల నుంచి టెక్సాస్‌లో వాతావరణం భయానకంగా ఉంది. వరుసగా బలమైన తుఫాన్లు రావడంతో ఆ రాష్ట్రంలో వెదర్ అంతుచిక్కకుండా ఉంది. హూస్టన్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇళ్లు కూలిపోవడం వల్ల ఓ వ్యక్తి మరణించాడు.