లైంగిక వేధింపుల కేసులో ఆ నేత హస్తం పై రాజకీయ దుమారం !

-

చిన్నారులను లైంగికంగా వేధించిన ఘటన ఖమ్మం జిల్లాలో పెద్ద దుమారమే రేపింది. ఇలాంటి అంశాలలో ప్రజాప్రతినిధులు చాలా దూరంగా ఉంటారు. కానీ.. నిందితుడికి ఓ ప్రజాప్రతినిధి అండగా ఉండి చర్యలు తీసుకోకుండా అడ్డుపడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.తెర వెనక జరిగిన మంత్రాంగాలు ఒక్కోక్కటిగా బయటికొస్తుండటం ఇప్పుడు జిల్లాలో సంచలనంగా మారింది. ఆ ప్రజాప్రతినిధి చట్టసభలకు ఎన్నికవ్వక ముందు టీచర్ గా కొనసాగడం ఇక్కడ కొసమెరుపు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓ గిరిజన గ్రామంలో ఐదుగురు బాలికలపై ఓ టీచర్‌ లైంగిక వేధింపులు సంచలనంగా మారాయి. చిన్నారులపట్ల ఆ గురురూప రాక్షసుడి అకృత్యాలపై అంతా మండిపడ్డారు. బాధ్యుడైన టీచర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు జనం. అయితే ఆరోపణలను ఎదుర్కొంటున్న టీచర్‌కు మద్దతుగా మరో ఐదుగురు ఉపాధ్యాయులు రాజీకి యత్నించడం కలకలం రేపింది. అసలే లైంగిక వేధిపుల కేసు.. ఆపై నిందితుడికి మద్దతుగా టీచర్ల రాయబారం గురించి తెలుసుకుని అధికారులు అవాక్కయ్యారు. మధ్యవర్తులందరిపైనా చర్యలు చేపట్టారు. నిందితులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు ఉద్యమించాయి.

గిరిజన గ్రామానికి చెందిన బాలికలను లైంగికంగా వేధించారని తెలియగానే.. వారిని పరామర్శించడానికి ఒక్క అధికారి వెంటనే వెళ్లలేదట. మంత్రులు వస్తున్నారంటేనే ఆ ఊరి ముఖం చూశారట. అయితే ఈ ఘటనలో నిందితుడి తరఫున .. జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కూడా మధ్యవర్తిత్వం వహించారట. టీచర్‌ను ఈ కేసు నుంచి బయట పడేయడానికి ప్రయత్నించినట్టు సమాచారం. ఆ ప్రజాప్రతినిధి ఒత్తిడివల్లే జిల్లా యంత్రాంగం కదలలేదని తెలుస్తోంది. దాంతో ఆ ప్రజాప్రతినిధి ఎవరన్నదానిపై ఎవరికి వారుగా ఆరా తీస్తున్నారట. తెరవెనక జరిగిన మంత్రాంగాలు.. ఒత్తిళ్లు మెల్లగా బయటకొస్తున్నాయట.

మధ్యవర్తిత్వం వహించిన టీచర్లపై చర్యలు తీసుకున్న అధికారులు.. నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నించిన ప్రజాప్రతినిధిని పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తోందట. అటు అధికార పార్టీలోనూ.. ఇటు అధికార వర్గాల్లోనూ ఈ అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతమైతే ఆ ప్రజాప్రతినిధి వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదట. అసలు ఆ దిశగా ఆలోచన చేసే తీరికే అధికారులకు లేదని సమాచారం. ఇప్పటికి జరిగిందేదో జరిగింది.. ఇక జరగాల్సింది చూస్తే చాలన్న ధోరణిలో ఉన్నారట. ఈ ఎపిసోడ్‌లో ఆ ప్రజాప్రతినిధి సేఫ్‌ జోన్‌లోనే ఉన్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version