చంద్రబాబు పై బాలయ్య అలకకు కారణం అదేనా

-

నందమూరి బాలకృష్ణ ఏం చేసినా సంచలనమే. ఒక్కోసారి ఆయన ఏం చెయ్యకుండా ఉన్నా సంచలనమే అని చెప్పాలి. హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య తీరు ఇప్పుడు పార్టీలో కొత్త చర్చకు దారి తీస్తోంది. అధినేతతో బాలయ్యకు గ్యాప్ పెరిగిందా..అందుబాటులో ఉన్నా కీలక పొలిట్ బ్యూరో మీటింగ్ కు ఎందుకు డుమ్మా కొట్టారు బాలయ్య మనసులో ఏముందన్నది ఇప్పుడు తెలుగు తమ్ముళ్లలో ఆసక్తి రేపుతుంది.

కొద్ది రోజుల క్రితం అధినేత చంద్రబాబు వేసిన పార్టీ కమిటీల్లో బాలయ్యకు చోటు కల్పించారు. అప్పటి వరకు పార్టీలో ఎమ్మెల్యేగానే ఉన్న బాలకృష్ణను పార్టీ ఉన్నత వేదిక పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. అయితే పొలిట్ బ్యూరో సంఖ్యను అమాంతం 25కు పెంచడంతో దానికి ప్రాధాన్యం లేకుండా పోయింది. కొత్త వారికి పదవి వచ్చిందన్న ఆనందం లేకపోగా, ఇప్పటి కే సభ్యులుగా ఉన్న వారు కీలక వ్యవస్థని పలుచన చేశారనే అభిప్రాయానికి వచ్చేశారు. అయితే రెండు రోజుల క్రితం జరిగిన పొలిట్ బ్యూరో సమావేశానికి బాలయ్య డుమ్మా కొట్టారు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

బాలయ్య ని పొలిట్ బ్యూరోలోకి తీసుకున్న కారణంగానే ఇదే సామాజికవర్గం నుంచి ఇతర నేతలకు అవకాశం ఇవ్వలేకపోతున్నట్లు చంద్రబాబు పార్టీ నేతలకు చెప్పారు. కొందరు పొలిట్ బ్యూరో ని ఆశించగా, బాలయ్య పేరుతో వారికి సర్ది చెప్పారు. అయితే పొలిట్ బ్యూరోలో బాలయ్యను తీసుకున్న తరువాత కూడా ఆయన అంత సంతృఫ్తిగా లేరనే వాదన వినిపిస్తుంది. పార్టీలో అతి కొద్ది మందితోనే మాట్లాడే బాలయ్య ఒకటి రెండు సందర్భాల్లో పార్టీ పోకడలు, అదిష్టానం వైఖరిపై తన అసంతృప్తిని వెళ్ల గక్కారట.

అయితే ఇలాంటి సమయంలో జరిగిన పొలిట్ బ్యూరో మీటింగ్ కు బాలయ్య రాలేదు. దీనికి కరోనా పరిస్థితులు కారణం అని చెప్పడానికి కూడా లేదు. రెగ్యులర్ గా బాలయ్య పార్టీ సమావేశాలకు వచ్చింది ఎప్పుడూ లేదు కానీ, కీలకమైన పొలిట్ బ్యూరోకు రాని బాలయ్య..ఇప్పుడు నియోజకవర్గ టూర్ పెట్టుకున్నారు. దీని వెనుక కారణం ఏంటి…ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది ఇప్పుడు చర్చగా మారింది. హైదరాబాద్ లో ఉండి కూడా బాలయ్య పార్టీ కీలక సమావేశాలకు దూరంగా ఉన్నరన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తం అవుతుంది.

అయితే అసలు బాలకృష్ణ ఏం ఆశిస్తున్నారు. పార్టీలో అంతా తానై ఉండే పోస్ట్ కోరుకుంటున్నారా? లేక మరేదైనా లెక్కలు ఉన్నాయా అనేది ఇప్పుడు నేతల్లో జరుగుతున్నచర్చ. అదినేత చంద్రబాబుకు ఎనీటైం సపోర్ట్ గానే ఉన్నారు. పార్టీ నిర్వహణ, నాయకత్వం విషయంలో బాలయ్య బాబుపై మొదటినుంచి పూర్తి నమ్మకంతో ఉన్నారు. అన్ని వేళల్లో మద్దతు కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు బాలయ్య ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు అనేది పార్టీలో చర్చగా మారింది. ఇవన్నీ చూస్తే, బాలకృష్ణ ఇప్పుడు అటు చంద్రబాబునాయుడితోపాటు ఇటు నారా లోకేష్ పై కూడా గుర్రుగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version